- పెయిడ్ న్యూస్ పర్యవేక్షణకు ఎంసీఎంసీ కమిటీలు
- ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి
- హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు : ప్రచార కార్యక్రమాలకు సంబంధించి అడ్వర్‌టైజ్‌మెంట్‌లు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఆడియో వీడియో డిస్ ప్లే, సినిమా థియేటర్లు, ఎఫ్ఎం రేడియో, బల్క్ ఎస్ఎంఎస్ లు, వెబ్ సైట్లో ప్రసారం చేసే వీడియో అడ్వర్‌టైజ్‌మెంట్‌లతో పాటు వాల్ రైటింగ్ డిస్ ప్లే వెహికల్స్ కు ముందస్తు అనుమతులు పొందాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గురువారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
ప్రింట్,ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వచ్చే పెయిడ్ న్యూస్ గుర్తింపునకు ప్రత్యేకంగా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)ని బల్దియా హెడ్డాఫీసులోని సీపీఆర్ వో సెక్షన్ లో ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ఎన్నికల అధికారి చైర్మన్ గా ఉన్న ఈ కమిటీలో ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్టు, జీహెచ్ఎంసీ సీపీఆర్ వోలను నియమించామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్ చానల్స్, లోకల్ కేబుల్ నెట్ వర్క్స్ లో ప్రసారమయ్యే అన్ని రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీతో ముందస్తు అనుమతి పొందాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రకటనలకు సంబంధించి రాష్ట్ర స్థాయి ఎంసీఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక నిఘా ...
పెయిడ్ న్యూస్‌కు సంబంధించి సమాచార శాఖ అందించిన రేట్ కార్డును అనుసరించి వాటికి అయ్యే ఖర్చను ఎన్నికల వ్యయంలో జమ చేయడానికిగాను ఆర్ వో ద్వారా నోటీసులు జారీ చేస్తామని రోనాల్డ్ రాస్ తెలిపారు. ఈ నోటీసును ప్రతి ఎన్నికల వ్యయ పరిశీలకులకు కూడా అందజేస్తారన్నారు. పెయిడ్ న్యూస్‌పై రిటర్నింగ్ అధికారి జారీచేసిన నోటీసులకు సంబంధిత అభ్యర్థులు 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ALSO READ: హమాస్‌తో ఇజ్రాయెల్ హోరాహోరీ : మల్లంపల్లి ధూర్జటి
అభ్యర్థుల సమాధానానికి ఎంసీఎంసీ కమిటీ సంతృప్తి చెందకపోతే ఆ ఖర్చును అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలుపుతారన్నారు. అయితే, ఎంసీఎంసీ నిర్ణయాన్ని రాష్ట్ర స్థాయి కమిటీకి రెఫర్ చేసే అవకాశం అభ్యర్థికి ఉంటుందన్నారు. చానెళ్లలో వచ్చే వార్తలను రికార్డింగ్ చేస్తున్నామని, హైదరాబాద్ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులు, పార్టీలు నిర్వహించే ప్రచారాలకు సంబంధించి రికార్డింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి పెయిడ్ న్యూస్, ప్రకటనలకు సంబంధించి వ్యయాన్ని వారిఎన్నికల వ్యయంలో కలపనున్నట్టు రోనాల్డ్ రోస్ వెల్లడించారు.