- జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించిన మంత్రి పొన్నం
- అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
- సమస్యలుంటే ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు ఇవ్వాలి
- ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: పొన్నం
హైదరాబాద్ సిటీ, వెలుగు: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని, అడిగిన సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ నెల 30 వరకు ఈ సర్వే జరుగుతుందని, ఒక్కో ఎన్యుమరేటర్కు150 ఇండ్లను అప్పగించామని, వారు ఇండ్లకు స్టిక్కర్వేసి యజమానులకు సమాచారమిస్తారన్నారు.
ఈ నెల 9 నుంచి కుటుంబ వివరాలు సేకరిస్తారన్నారు. కుటుంబానికి సంబంధించిన అన్ని రకాల సమాచారం తీసుకుంటారని, ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. ఈ సర్వేతో వచ్చే సమాచారంతో భవిష్యత్ లో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సర్వేతో ఎవరికీ అన్యాయం జరగదన్నారు. స్వచ్ఛంద సంస్థలు, అన్ని కుల సంఘాలు, ప్రతిపక్ష పార్టీల లీడర్లు భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలను భ్రమపెట్టి, భయపెట్టే విధంగా ప్రవర్తించకూడదని, అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సర్వేకు ఆటంకాలు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆధార్ కార్డు ఆప్షనల్ మాత్రమే..
గ్రేటర్ హైదరాబాద్లోని 29,58,277 ఇండ్ల సర్వేకు 20,920 మంది ఎన్యుమరేటర్లను, 1728 మంది సూపర్ వైజర్లను నియమించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. సర్వే సమయంలో ఎన్యుమరేటర్లు ప్రజలకు కలిగే అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. ప్రజలు ఇచ్చే సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు. స్వాతంత్ర్యం రాక ముందు 1931లో కుల గణన జరిగిందని, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే జరుగుతుందన్నారు. సమాచారం ఇచ్చేవారి మాటే డిక్లరేషన్ అని, ఆధార్ కార్డు ఆప్షనల్ మాత్రమే అని అన్నారు.
రాజకీయాలు రాజకీయాలే.. సర్వేకు అడ్డు రావొద్దు
‘ఇంటర్నల్గా సమస్య ఉంటే రాజకీయంగా చేసుకుందాం.. కానీ ఈ సర్వేకి అడ్డు వస్తే బలహీన వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదు’ అని మంత్రి ప్రతిపక్షాలను హెచ్చరించారు. అడ్డుపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఎన్జీఓలు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు సర్వేకు సహకారం అందించాలని కోరారు. తర్వాత ఎన్యుమరేటర్లకు సర్వే సామగ్రి పంపిణీ చేశారు.
అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, స్నేహ శబరీశ్, అలివేలు మంగతాయారు, చంద్రకాంత్ రెడ్డి, జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, జోనల్ ఫైనాన్స్ అడ్వైజర్ శరత్ చంద్ర, డిప్యూటీ కమిషనర్ రజినీ కాంత్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో తొలిరోజు 1,69,786 ఇండ్లకు సర్వే స్టిక్కర్లు అంటించినట్లు అధికారులు తెలిపారు. కొడంగల్/ మేడ్చల్ కలెక్టరేట్/ ఇబ్రహీంపట్నం/ షాద్నగర్: కొడంగల్ మున్సిపాలటీలో జరుగుతున్న సర్వే తీరును వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాంపల్లి, గోధుమకుంట, శామీర్ పేట్, అంతాయిపల్లిలో నిర్వహిస్తున్న సర్వేను అడిషన్ కలెక్టర్ రాధికా గుప్తాతో కలిసి కలెక్టర్ గౌతమ్ ప్రారంభించారు. షాద్ నగర్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సర్వేను పర్యవేక్షించారు.
సర్వేకు సహకరించాలి: డిప్యూటీ మేయర్
సికింద్రాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సర్వేకు ప్రజలు సహకరించాలని గ్రేటర్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి కోరారు. ఎన్యుమరేటర్లకు తమ పూర్తి వివరాలు తెలపాలని సూచించారు. తార్నాకలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహించిన సామాజిక సర్వేలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్ సుభాష్ , అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.