
- 2022లో చిట్ట చివరి స్థానం
- మార్చి 21 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు
- స్కూళ్లను విజిట్చేయని డీఈవో
- ఉత్తీర్ణతా శాతం పెంచడానికి కలెక్టర్చొరవ
హైదరాబాద్ సిటీ, వెలుగు : పదో తరగతి ఫలితాల్లో మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ ప్రతి ఏడాది వెనకబడిపోతోంది. రాష్ట్ర పరిపాలనకు కేంద్రంగా ఉండి ఫలితాల్లో మాత్రం ఎప్పుడూ చివరి ఐదు స్థానాల్లోనే నిలుస్తోంది. టీచర్లు సిలబస్సకాలంలో పూర్తి చేయకపోవడం, రివిజన్చేయించకపోవడం, స్లిప్ టెస్టులు రాయించకపోవడం వల్ల ఉత్తీర్ణత శాతం తగ్గుతుందనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్స్కూల్స్తో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం మరీ దారుణంగా నమోదవుతోంది.
గతేడాది జిల్లాలో 73,202 మంది ఎగ్జామ్స్ రాయగా, 63,511 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఈ లెక్కన 33 జిల్లాల్లో 86 శాతం ఉత్తీర్ణతతో 30వ స్థానంలో నిలిచింది. అంతకు మందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది పాస్ పర్సంటేజ్ పెరిగినా... స్థానంపరంగా మరో రెండు ప్లేసులు కిందకు దిగజారింది. మిగతా జిల్లాలతో పోలిస్తే జిల్లాలో స్టూడెంట్స్ఎక్కువగా ఉండడం కూడా ఫలితాలపై ప్రభావం చూపిస్తోందని అధికారులు అంటున్నారు.
ఇతర జిల్లాల్లో సగటున 30 నుంచి 40 వేల మంది ఎస్సెస్సీ పరీక్షలు రాస్తుంటారని, మన దగ్గర ఆ సంఖ్య డబుల్ఉండడంతో సవాల్‌గా మారిందంటున్నారు. జిల్లాలో182 ప్రభుత్వ హైస్కూల్స్ ఉండగా అందులో 8,500 మందికి పైగానే స్టూడెంట్స్చదువుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు, ప్రైవేట్ స్కూళ్లలో ఈసారి 77,701 మంది చదువుతున్నారు.
స్కూళ్ల వైపు చూడని డీఈఓ
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పాస్ పర్సంటేజ్ ను పెంచడానికి ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ప్లాన్ రూపొందించుకొని, ఆదిశగా ముందుకు వెళ్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఏటా జిల్లా ఎస్సెస్సీ ఫలితాల్లో వెనకబడుతున్నా విద్యాశాఖాధికారి రోహిణి మాత్రం ఆఫీసుకే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి.
ఆమె ఏనాడూ స్కూళ్లను సందర్శించిన సందర్భాలు లేవని హెడ్ మాస్టర్లు చెబుతున్నారు. మంత్రులు, కలెక్టర్ స్కూళ్లకు వెళ్లినప్పుడు మాత్రం వారితోపాటు స్కూళ్లకు వెళ్లడం తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడూ ఏ స్కూల్‌కూ వచ్చింది లేదంటున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి మరింత దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించవచ్చంటున్నారు.
కలెక్టర్ శ్రమ ఫలించేనా?
ఎస్సెస్సీ రిజల్ట్స్‌లో జిల్లా వెనకబడడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తరచుగా సర్కార్ స్కూళ్లను విజిట్ చేస్తున్నారు. ఉత్తీర్ణత శాతం పెంచడానికి టీచర్లకు, స్టూడెంట్స్‌కు సలహాలు, సూచనలిస్తున్నారు. రెగ్యులర్‌గా రివ్యూ చేస్తూ ఆయా స్కూళ్లలో పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఇన్‌టైమ్‌లో సిలబస్ పూర్తి చేసి, రివిజన్, మాక్ టెస్టులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. హెచ్ఎంలలో ఉత్తేజాన్ని నింపేందుకు, స్కూళ్లలో అటెండెన్స్ పెంచేందుకు కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది పాస్ పర్సంటేజ్ 90 శాతం దాటాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.
గ్రేటర్‌లోని మిగతా జిల్లాల పరిస్థితి..
హైదరాబాద్జిల్లానే కాదు చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలు కూడా పదో తరగతి ఫలితాల్లో డీలా పడుతున్నాయి. 2023లో 20వ స్థానంలో నిలిచిన రంగారెడ్డి గతేడాది 24వ స్థానానికి పడిపోయింది. 2023లో 14వ స్థానంలో ఉన్న మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా గతేడాది 27వ స్థానానికి పడిపోయింది. రంగారెడ్డిలో 50,811 మంది పదో తరగతి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయగా, 46,245 మంది పాసయ్యారు. మొత్తంగా 91.01 పాస్‌పర్సంటేజ్ నమోదైంది. మేడ్చల్ జిల్లాలో 46,736 మంది పరీక్షలు రాయగా, 41,879 మంది పాసయ్యారు. 89.61 శాతం పర్సంటేజ్ నమోదైంది.