
- ఫ్రెండ్స్‌తో కలిసి హంపికి వెళ్లిన యువతి
- తుంగభద్ర నదిలో ఈత కొడుతుండగా ప్రమాదం
హైదరాబాద్, వెలుగు : ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా కర్నాటక టూర్‌కు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ తుంగభద్ర నదిలో పడి చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే... మేడ్చల్ మల్కాజ్‌గిరి పరిధిలోని సుచిత్ర ప్రాంతానికి చెందిన అనన్యరావు (26) గైనకాలజిస్ట్‌గా పనిచేస్తూ అశోక మాన్షన్‌లో నివాసం ఉంటోంది. మూడు రోజుల కింద తన ఫ్రెండ్స్ సాత్విన్, హషితతో కలిసి కర్నాటకలోని హంపి టూర్‌కు వెళ్లింది. మంగళవారం రాత్రి సణాపురలోని గెస్ట్‌హౌజ్‌లో బస చేసిన వీరు బుధవారం మధ్యాహ్నం తుంగభద్ర నది వద్దకు వెళ్లి కొద్దిసేపు ఈత కొట్టారు.
తర్వాత అనన్యరావు నదికి అనుకొని ఉన్న కొండచరియ పైకి ఎక్కి నీటిలోకి దూకింది. కొద్దిసేపు ఈత కొట్టిన తర్వాత నీటి ప్రవాహం ఎక్కువ అవుతుండడంతో బయటకు వచ్చేందుకు యత్నించింది. కానీ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయింది.
గమనించిన ఆమె ఫ్రెండ్స్ కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మూడు గంటల పాటు గాలించగా బుధవారం రాత్రి అనన్యరావు డెడ్‌బాడీ దొరికింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు గంగావతి పీఎస్ పోలీసులు తెలిపారు. కాగా చనిపోయిన అనన్యరావు.. మైనంపల్లి హనుమంతరావు బంధువు కూతురని సమాచారం.