మహిళా డాక్టర్​కు సైబర్ చీటర్స్ టోకరా

మహిళా డాక్టర్​కు సైబర్ చీటర్స్ టోకరా

బషీర్ బాగ్, వెలుగు: మెడికల్ సర్టిఫికెట్ల పేరిట  మహిళా డాక్టర్​ను సైబర్ చీటర్స్ మోసగించారు.  హైదరాబాద్ కు  చెందిన 49 ఏండ్ల మహిళా డాక్టర్ కు వాట్సాప్ ద్వారా కాల్ చేసి, ఆర్మీ అధికారిగా స్కామర్ పరిచయం చేసుకున్నాడు. బాధితురాలి క్లినిక్​కు తను  పంపించే మహిళలకు మెడికల్ టెస్టులు చేసి, సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరాడు. ఇందుకు డాక్టర్  ముందుగానే ఫీజు ఇవ్వాలని కోరగా, స్కామర్ అందుకు అంగీకరించాడు.

ఆ తర్వాత ఆమెకు వీడియో కాల్ చేసి, మొత్తం 90 మంది మహిళలను పంపిస్తామని, ఒక్కొక్కరికి రూ.400 చొప్పున రూ.37 వేలు చెల్లిస్తామని నమ్మబలికాడు. అనంతరం ఆమె బ్యాంక్ అకౌంట్ వివరాలను తెలుసుకొని, తొలుత రూ.10 బదిలీ చేశాడు.  అనంతరం ఆమె క్రెడిట్ కార్డు నుంచి స్కామర్లు రూ.1.40 లక్షలు కొట్టేశారు. ఆమెకు ఎలాంటి ఓటీపీ రాకపోవడం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు  సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.