- ఏడాదంతా పనులు చేస్తున్నామని ఉత్తుత్తి ప్రకటనలు
- ఏటా రూ.40 –55 కోట్లు ఖర్చు
- పిచ్చిమొక్కలు, బురద, చెత్తతో నిలిచిపోతున్న మురుగు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో నాలాల పూడికతీత పనులు నామ్కే వాస్తేగా నిర్వహిస్తున్నారు. మూడేండ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో చాలా నాలాల్లో చెత్త, బురద, పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. దీంతో మురుగు స్లోగా వెళ్తోంది. గతంలో వచ్చిన వరదలతో నాలాల పూడికతీత పనులు నిరంతరం చేస్తామని అధికారులు ప్రకటించినా ఎక్కడా జరగడం లేదు.
40 నుంచి 55 కోట్ల ఖర్చు..
బల్దియా పరిధిలో దాదాపు వెయ్యి కిలో మీటర్ల మేర వర్షపు నీటి కాల్వలుండగా, మేజర్ నాలాలు 398 కిలోమీటర్లు, పైపులైన్ డ్రైన్లు, చిన్న సైజు నాలాలు 600 కిలోమీటర్లకు పైగానే ఉన్నాయి. ఈ నాలాల్లో 5 లక్షలకుపైగా క్యూబిక్ మీటర్ల పూడిక పేరుకుపోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తుండగా, ఇది 10 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. గతంలో ప్రతి ఎండాకాలంలో పూడిక తీసేవారు.
మూడేండ్లుగా రెగ్యులర్గా పనులు చేయకపోవడంతో పూడిక భారీగా పేరుకుపోయింది. చాలా చోట్ల చెట్లు, పిచ్చిమొక్కలు పెరిగాయి. వరద వస్తే వెళ్లేందుకు దారి కూడా లేదు. ఇక ఇండ్లలోంచి వచ్చిన డ్రైయిన్ వాటర్ కూడా సాఫీగా వెళ్లడం లేదు. ఏటా వీటి పూడికతీత కోసం బల్దియా రూ.40 కోట్ల నుంచి రూ.55 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని చెప్తుండగా, ఒక్క నాలా కూడా క్లీన్ గా కనిపించడం లేదు.
వర్షాలు కురిస్తే నాలాలు పొంగిపొర్లుతుండటంతో కాలనీలు, బస్తీలపై ఆ ప్రభావంపై పడుతోంది. గతంలో నాలాల పూడికతీత పనులు చేయని అధికారుల వేతనాల్లో కోత విధించారు. పనులు చేయకుండా డబ్బులు తిన్నారని విజిలెన్స్ విచారణలో తేలడంతో పలువురిపై యాక్షన్తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో చర్యలు తీసుకుంటే నాలాల పూడికతీత పనులు రెగ్యులర్ గా జరుగుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పురాతన నాలాల సంగతేంది?
నాలాల పూడికతీత చేపట్టకపోవడంతో పాటు మెయింటెనెన్స్కూడా చేయడంలేదు. పురాతన నాలాల పటిష్టతను పరిశీలించడం లేదు. దీంతో చాలా చోట్ల నాలాలు కుంగిపోతున్నాయి. గోషామహల్ లో నాలా రెండు సార్లు కుంగిపోయింది. హిమాయత్ నగర్ లోనూ ఇలాగే ఓ డ్రైనేజీ లైన్ కుంగింది. గ్రేటర్ లో సర్కిళ్లు.
జోన్ల వారీగా పురాతన నాలాలు ఎక్కడెక్కడున్నాయని, వాటి పరిస్థితి ఎలా ఉందన్నది పరిశీలించి చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండదని నిపుణులు చెప్తున్నారు. కానీ, అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదు. ఘటన జరిగినప్పుడు మాత్రం నాలాల పటిష్టతపై ఫోకస్ పెడతామని ప్రకటనలు మాత్రం చేస్తున్నారు.