
- ఎండలు ముదురుతుండడంతో పెరుగుతున్న డిమాండ్
- శ్రీశైలం, సాగర్‌లో వేగంగా పడిపోతున్న నీటి మట్టాలు
- ఇప్పటికే సాగర్ నుంచి సాగునీటి విడుదల బంద్
- దాని నుంచి ఏపీ తాగునీళ్లు తీస్కుంటే.. నీటిమట్టం 510 అడుగుల దిగువకు పడిపోయే ముప్పు
- అదే జరిగితే మోటార్లు పెట్టుకుని నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుందని ఆందోళన
- గోదావరిలోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు,
- లోయర్మానేరులోనూ భారీగా పడిపోయిన మట్టాలు
- హైదరాబాద్‌కు కావాల్సింది 750 ఎంజీడీలు..ఇస్తున్నది 550 ఎంజీడీలు
- రాజధానిలో వాటర్ ట్యాంకర్లకు పెరుగుతున్న డిమాండ్
- మార్చిలో రోజూ 7 వేల ట్యాంకర్లు.. ఇప్పుడు 12 వేలు
- మేలో 15 వేల ట్యాంకర్లకు చేరనున్న డిమాండ్
హైదరాబాద్ / హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎండలు ముదురుతుండడంతో సర్కారుకు తాగునీటి సరఫరా సవాల్‌గా మారుతున్నది. పెరుగుతున్న ఎండలతో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో తాగునీటికి డిమాండ్పెరగ్గా, హైదరాబాద్ సిటీలోనూ ట్యాంకర్లకు డిమాండ్ ఏర్పడింది. ఏప్రిల్ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మేలో మరింత తీవ్రంగా మారొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు ఇప్పటికే సాగు నీళ్ల పేరు చెప్పి శ్రీశైలం, నాగార్జున సాగర్ ఖాళీ చేసిన ఏపీ.. ఇప్పుడు తాగునీటి సాకు చూపి మరిన్ని నీళ్లను తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా జాగ్రత్త పడకుంటే ఎండాకాలంలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాగర్‌లో నీటిమట్టం గణనీయంగా పడిపోవడంతో తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్‌కు నీటి విడుదల నిలిపేశారు. ఇటు గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లోనూ నీటి మట్టాలు డెడ్‌స్టోరేజీకి చేరువవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ రెండు ప్రాజెక్టులతో పాటు అటు గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల నుంచి జాగ్రత్తగా తాగునీటి సరఫరా చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీశైలం ఓకే.. సాగర్‌లోనే సమస్య..
కృష్ణా ప్రాజెక్టుల నుంచి తాగునీటి సరఫరా విషయంలో ఎప్పట్లాగే ఇబ్బందులు తప్పేలా లేవు. ఫిబ్రవరిలో నిర్వహించిన కేఆర్ఎంబీ మీటింగ్‌లో శ్రీశైలం నుంచి 822 అడుగులకు దిగువన, సాగర్ నుంచి 515 అడుగులకు దిగువన కేవలం తాగునీటి కోసమే డ్రా చేసుకోవాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం ఆ రెండు ప్రాజెక్టుల్లోనూ నాడు నిర్ణయించిన లెవెల్కంటే దిగువకు నీటి మట్టాలు పడిపోతున్నాయి. శ్రీశైలంలో ప్రస్తుతం 817 అడుగుల వద్ద డెడ్స్టోరేజీతో కలిపి 39 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. ఇక సాగర్‌లో 515 అడుగుల వద్ద డెడ్స్టోరేజీతో కలిపి 140 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో కలిపి తాగునీటి కోసం కేవలం14 టీఎంసీల నీళ్లే అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం నుంచి ఇబ్బంది లేకపోయినా.. సాగర్నుంచే ఎక్కువ నీటి అవసరాలు ఉంటాయి.
ఇప్పటికే ఏపీ తన కోటా మొత్తాన్ని తీసుకెళ్లిపోయినా.. మళ్లీ ఇప్పుడు తాగునీటి అవసరాల కోసమని నీటిని తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కేఆర్ఎంబీ అనుమతిస్తే ఏపీ ప్రభుత్వం కుడి కాల్వ గేట్లు ఎత్తుకుని ఈజీగా నీటిని తరలించి, అక్కడి సమ్మర్ట్యాంకుల్లో నిల్వ చేసుకుంటుంది. అదే జరిగితే సాగర్‌నీటి మట్టం కొద్ది రోజుల్లోనే 510 అడుగుల దిగువకు పడిపోతుందని, ఆ తర్వాత మనం హైదరాబాద్అవసరాలకు మోటార్లు పెట్టుకుని లిఫ్ట్చేసుకునే పరిస్థితులు వస్తాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్తాగునీటి అవసరాల కోసం సాగర్‌నుంచి రోజూ 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో డెడ్‌స్టోరేజీకి నీళ్లు పడిపోయాయి. ఆ ప్రాజెక్ట్పూర్తిస్థాయి సామర్థ్యం 9.66 టీఎంసీలకుగానూ.. కేవలం 2.89 టీఎంసీల నీళ్లే ఉన్నాయి.
హైదరాబాద్‌కు కావాల్సింది 750 ఎంజీడీలు..
హైదరాబాద్‌లో భూగర్భ జలాలు పడిపోవడం, రోజు విడిచి రోజు, కొన్ని ఏరియాల్లో రెండు, మూడు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతుండడంతో తాగునీటి అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో మార్చి నుంచే జనం వాటర్ట్యాంకర్లపై ఆధారపడ్తున్నారు. ఏప్రిల్చివరి కల్లా పరిస్థితి తీవ్ర రూపం దాల్చనుంది. నిజానికి హైదరాబాద్సిటీకి పూర్తిస్థాయిలో తాగునీటి అవసరాలు తీరాలంటే ప్రతిరోజూ 750 ఎంజీడీలు అవసరం. కానీ మార్చి ప్రారంభంలో సిటీకి మెట్రోవాటర్‌బోర్డు రోజూ 500 ఎంజీడీలు (మిలియన్ గ్యాలన్స్పర్డే) సరఫరా చేయగా, ప్రస్తుతం 550 ఎంజీడీలకు పైగా సప్లయ్ చేస్తున్నది.
నాగార్జున సాగర్ నుంచి 275 ఎంజీడీలు, ఎల్లంపల్లి నుంచి 163 ఎంజీడీలు, ఉస్మాన్సాగర్నుంచి 22.50 ఎంజీడీలు, హిమాయత్సాగర్నుంచి 10.58 ఎంజీడీలు, మంజీరా నుంచి 40.52 ఎంజీడీలు, సింగూరు నుంచి 69.07 ఎంజీడీలు కలిపి మొత్తంగా 581.35 ఎంజీడీల నీటిని డ్రా చేస్తున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 13.80 లక్షల నల్లా కనెక్షన్లకు అధికారులు రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. అలాగే ఓఆర్ఆర్పరిధిలోని కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, సికింద్రాబాద్కంటోన్మెంట్బోర్డు పరిధిలోని ప్రాంతాలకు బల్క్పద్ధతిలో నీళ్లు సప్లయ్ చేస్తున్నారు.
కానీ అవి కూడా సరిపోవడం లేదు. దీంతో ప్రజలు వాటర్ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారు. వెస్ట్సిటీలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మియాపూర్, హైటెక్‌సిటీ, కోకాపేట, నార్సింగి, శంకర్‌పల్లి, మెహిదీపట్నం వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో అక్కడి ప్రజలంతా వాటర్‌బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. మార్చిలో రోజూ 6 వేల నుంచి 7 వేల ట్యాంకర్లను మెట్రోవాటర్ బోర్డు సరఫరా చేయగా.. ప్రస్తుతం రోజూ 10 వేల నుంచి 12 వేల ట్యాంకర్లకు డిమాండ్పెరిగింది.
మేలో రోజుకు 15 వేల వరకు ట్యాంకులకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ మూడు (ఏప్రిల్, మే, జూన్) నెలలు సాగర్‌నుంచి నెలకు 1.38 టీఎంసీల చొప్పున 4.14 టీఎంసీలు, ఎల్లంపల్లి నుంచి నెలకు 0.84 టీఎంసీల చొప్పున 2.52 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయని అధికారులు ఇప్పటికే ఇండెంట్పెట్టారు. అందుకు అనుగుణంగా ఆ రెండు ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వను ఉంచుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
గోదావరి బేసిన్‌లోనూ డెడ్‌స్టోరేజీకి చేరువలో..
గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నీటి మట్టాలు డెడ్‌స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. శ్రీరాంసాగర్, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో వేగంగా నీటి మట్టాలు పడిపోతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 80.50 టీఎంసీలకుగానూ కేవలం 11.62 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. మిడ్‌మానేరులో పూర్తిస్థాయి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 7.24 టీఎంసీలు ఉన్నాయి. లోయర్‌మానేరులో 24.03 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 7.15 టీఎంసీలు ఉన్నాయి.
ఇక, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సిటీకి తాగునీటిని సరఫరా చేస్తుండడంతోనూ ప్రాజెక్టులో వేగంగా నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.18 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 9.01 టీఎంసీలు ఉన్నాయి. సిటీకి తాగునీటిని సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టులో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. ఆ ప్రాజెక్టులో 29.91 టీఎంసీలకు గాను.. 19.69 టీఎంసీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గోదావరి బేసిన్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జులై వరకు ఇబ్బంది లేదంటున్న అధికారులు..
ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టుల్లో ప్రస్తుతమున్న నీటితో జులై వరకు తాగునీటిని సరఫరా చేయొచ్చని చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే.. ఇప్పుడు ప్రాజెక్టుల్లో మెరుగ్గా నీళ్లున్నాయని, ఎండాకాలంలోనూ తాగునీటి కష్టాలు ఉండవని అంటున్నారు. ఈ మేరకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నామని, అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్క జూరాల తప్ప ఇటు కృష్ణా, అటు గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల్లో ఎక్కడా డెడ్‌స్టోరేజీకి నీటి మట్టాలు పడిపోలేదని వివరిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ప్రస్తుతం సాగర్పరిధిలో కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటి విడుదలను నిలుపుదల చేశారు.
వేసవిలో తాగునీటి అవసరాల కోసమే నీటిని వాడుకోవాల్సిన అవసరం ఉండడంతో రెండు రాష్ట్రాలూ నీటిని తీసుకోవడం ఆపేశాయి. అయితే ప్రతిసారీ ఆఫీసర్లు ఇలాగే చెప్తున్నా ఏప్రిల్ చివరికల్లా రాష్ట్రవ్యాప్తంగా తాగు నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. మే మొదటి వారంకల్లా భూగర్భజలాలు వేగంగా పడిపోయి నీటి ఎద్దడి ఏర్పడుతోంది. మేలో హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాల్లో రెండు, మూడ్రోజులకోసారి కూడా నల్లా నీరు రావడం లేదు. వందల గ్రామాల్లో వారానికోసారి కూడా భగీరథ నీళ్లకు దిక్కుండదు. ఆయా చోట్ల ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తోంది. గత అనుభవాల దృష్ట్యా ఆఫీసర్లు ఈసారైనా పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే తప్ప తాగునీటి ఎద్దడి తప్పదు.