MBS జ్యుయెలర్స్ అధినేత సుఖేష్ గుప్తాపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ కోర్టు ఇప్పటికే 9 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో.. నవంబర్ 2 వరకు సుఖేష్ గుప్తాను ఈడీ విచారించనుంది. గతంలో 2 రోజుల పాటు సోదాలు చేసి రూ.150 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2 కోట్ల నగదును ఈడీ సీజ్ చేసింది. MMTCని రూ.504 కోట్ల దాకా మోసం చేసినట్లు సుఖేష్ పై ఈడీ అభియోగాలు మోపింది. MMTC సంస్థ నుంచి కొన్న బంగారం అమ్మకాలకు సంబంధించిన డబ్బు ఎక్కడికి తరలించాడనే అంశంపై ఈడీ ఆరా తీసింది. ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల ఎగవేతపైనా సుఖేష్ గుప్తాను ప్రశ్నించింది.
చంచల్ గూడ జైలులో ఉన్న సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ఈడీ ఆఫీస్ కు తీసుకెళ్లారు. మనీలాండరింగ్ కోణంలో సుఖేష్ ను 9 రోజుల పాటు విచారించనున్నారు. శ్రేయి ఫైనాన్స్ లో సుఖేష్ రూ.110 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఆ డబ్బుతో MMTC సంస్థలో కొన్న బంగారం గురించి కూడా అధికారులు ఆరా తీయనున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో శ్రేయి ఫైనాన్స్ లో సుఖేష్ రుణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సుఖేష్ ను రేపు మరోసారి ఈడీ అధికారులు విచారించనున్నారు.