భూమి ఇస్తే సరిపోదు బిల్డింగులూ కట్టివ్వాలి..ఎలివేటెడ్​ కారిడార్​ భూసేకరణలో రక్షణ శాఖ కొత్త మెలిక 

భూమి ఇస్తే సరిపోదు బిల్డింగులూ కట్టివ్వాలి..ఎలివేటెడ్​ కారిడార్​ భూసేకరణలో రక్షణ శాఖ కొత్త మెలిక 
  • రిజర్వాయర్లు కూడా నిర్మించాల్సిందే.. 
  • తమ భవనాలు కూలిస్తే మరో చోట నిర్మించి ఇవ్వాలని డిమాండ్​
  • జేబీఎస్​– శామీర్​పేటకారిడార్​లో భూసేకరణ లేట్

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్​కు అవాంతరాలు తప్పడం లేదు. భూ సేకరణ విషయంలో హెచ్ఎండీఏ అధికారులు, కంటోన్మెంట్​అధికారుల మధ్య కొనసాగుతున్న సంప్రతింపులు కొలిక్కి రావడం లేదు. కట్టడాలు ఎక్కడెక్కడ కూల్చివేయాలో క్లారిటీ వచ్చినా తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ ప్రాజెక్టుకు అవరోధంగా మారుతున్నాయి. ముఖ్యంగా జేబీఎస్ నుంచి శామీర్​ పేట కారిడార్ కు సంబంధించి భూ సేకరణకు కంటోన్మెంట్ అధికారులు మెలికలు పెడుతున్నారు.

18.10 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ప్రాజెక్టుకు197 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో 113.48 ఎకరాలు రక్షణ శాఖకు సంబంధించినవే ఉన్నాయి. ఇప్పటి వరకు ఇరు శాఖలు స్థలానికి స్థలం ఇవ్వాలన్న నిర్ణయానికి రాగా, తాజాగా రక్షణ శాఖకు చెందిన భవనాలను కూలిస్తే వేరే ప్రాంతాల్లోఇచ్చే భూముల్లో కొత్త బిల్డింగులు కట్టివ్వాలని షరతులు పెడుతున్నట్టు హెచ్​ఎండీఏ అధికారులు చెప్తున్నారు. కొత్త నిర్మాణాలు పూర్తయిన తర్వాతే భూ బదలాయింపు చేస్తామని రక్షణ శాఖ స్పష్టం చేస్తుండడంతో జేబీఎస్​– శామీర్​పేట కారిడార్​ పనులు ఆలస్యమవుతున్నాయి.  

రిజర్వాయర్లు కూడా కట్టివ్వాలని...

జేబీఎస్​– శామీర్​పేట కారిడార్​భూ సేకరణలో భాగంగా తిరుమలగిరి, అల్వాల్ ప్రాంతాల్లో రెండు భారీ రిజర్వాయర్లు కూల్చాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ల ద్వారానే కంటోన్మెంట్​లోని పలు ప్రాంతాలకు సుమారు ఏడున్నర లక్షల గ్యాలన్ల నీటి సరఫరా జరుగుతోంది. వీటిని కూల్చివేస్తే వేరే చోట మళ్లీ కొత్త రిజర్వాయర్లు నిర్మించి ఇస్తేనే భూముల బదలాయింపు చేస్తామని కంటోన్మెంట్​అధికారులు తేల్చి చెప్తున్నారు. భూ సేకరణ పూర్తిచేస్తేనే ప్రాజెక్టు ముందుకు పోయే పరిస్థితి ఉండడంతో హెచ్ఎండీఏ అధికారులు ఆలోచనలో పడ్డారు.  

‘ప్యారడైజ్​–బోయిన్​పల్లి’ ఓకే  

ఎలివేటెడ్​ కారిడార్​ ప్రాజెక్టులో భాగంగా ప్యారడైజ్​–బోయిన్​పల్లి డెయిరీ ఫామ్​ వరకు నిర్మించనున్న కారిడార్​కు సంబంధించి భూ సేకరణ, ప్రాజెక్టు పనుల ప్రారంభానికి లైన్​క్లియర్​ అయ్యింది. ఈ కారిడార్​లో భూములను బదలాయింపునకు రక్షణ శాఖ నుంచి గ్రీన్​సిగ్నల్​ వచ్చిందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. దీంతో 15 రోజుల క్రితమే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆసక్తి చూపించే కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించారు.

మంగళవారం బిడ్లను ఓపెన్​ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో 5.4 కి.మీ మేర ఈ కారిడార్​పనులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బేగంపేట ఎయిర్​పోర్ట్​వద్ద తాడ్​బండ్​ వైపున 600 మీటర్ల మేర అండర్​ గ్రౌండ్​ టన్నెల్​నిర్మించనున్నారు. రూ. 652 కోట్ల ఈ ప్రాజెక్టు భూసేకరణతో కలిపి రూ. 1550 కోట్లతో నిర్మించనున్నారు