![హైదరాబాద్ స్టార్టప్‌లకు దండిగా నిధులు](https://static.v6velugu.com/uploads/2025/02/hyderabad-emerges-as-hub-for-startups-attracts-rs-5002-crore-in-funding_45Pm03YD7v.jpg)
- 2024లో రూ.5,002 కోట్ల పెట్టుబడులు
- 2023తో పోలిస్తే 160 శాతం పెరిగిన ఫండ్ రైజింగ్
- ట్రాక్షన్ జియో యాన్యువల్రిపోర్ట్లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ.. స్టార్టప్‌లకు కేరాఫ్‌గా మారుతున్నది. నిరుడు నగరంలోని స్టార్టప్‌లకు దండిగా నిధులు సమకూరాయి. బెంగళూరు స్టార్టప్‌లకు నిధుల సమీకరణ 25 శాతం పడిపోతే.. హైదరాబాద్‌లోని స్టార్టప్‌లకు 160 శాతం ఎక్కువగా నిధులు సమకూరాయి. ట్రాక్షన్ జియో యాన్యువల్ రిపోర్ట్ తెలంగాణ టెక్ 2024లో ఈ విషయం వెల్లడైంది. గత ఆర్థిక సంవత్సరం (2024)లో హైదరాబాద్‌లోని స్టార్టప్‌లు రూ.5,002 కోట్ల మేర నిధులను రైజ్ చేసినట్టు రిపోర్ట్ తేల్చింది. 2023లో కేవలం రూ.1,927 కోట్లే స్టార్టప్‌లకు ఇన్వెస్టర్లు నిధులివ్వగా.. 2024కు వచ్చే సరికి అది 160 శాతం పెరిగినట్టు వెల్లడించింది.
మరోవైపు 2024లో వచ్చిన ఫండింగ్‌లో ఎక్కువ శాతం తొలి అర్ధభాగంలోనే వచ్చినట్టు తేల్చింది. ఫస్టాఫ్‌లోనే రూ.4,240 కోట్ల మేర స్టార్టప్‌లకు ఫండింగ్వచ్చినట్టు నిర్ధారించింది. కాగా, 2022లో మొత్తంగా 3,627 కోట్ల ఫండింగ్ వస్తే.. 2023లో మాత్రం సగానికి పడిపోవడం గమనార్హం. ఆ తర్వాత మళ్లీ పుంజుకుని 2024లో ఫండింగ్ పెరిగింది. మొత్తంగా స్టార్టప్ ఎకో సిస్టమ్స్ఏర్పాటయినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో స్టార్టప్‌లు సుమారు రూ.30,234 కోట్ల మేర నిధులను రాబట్టినట్టు ట్రాక్షన్ రిపోర్ట్ వెల్లడించింది.
హెల్త్ సెక్టార్లోనే ఎక్కువ..
2024లో అత్యధిక ఫండింగ్ హెల్త్ కేర్ రంగానికే వచ్చినట్టు ట్రాక్షన్ రిపోర్ట్ వెల్లడించింది. మొత్తం రూ.5,002 కోట్ల ఫండింగ్‌లో హెల్త్ కేర్ రంగం వాటానే సుమారు రూ.2,629 కోట్లు కావడం విశేషం. అందులోనూ 99శాతం పెట్టుబడులు అపోలో గ్రూప్స్‌కే వచ్చాయి. 2023తో పోలిస్తే హెల్త్‌కేర్ రంగంలో స్టార్టప్‌లలో ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2,139 శాతం పెరిగాయంటేనే.. ఇన్వెస్టర్లు ఆ రంగంపై ఎంత ఆసక్తి చూపిస్తున్నారో అర్థమవుతోంది. మొత్తంగా స్టార్టప్‌లకు వచ్చిన పెట్టుబడుల్లో ఒక్క అపోలో ఫార్మసీ స్టోర్స్‌కే అడ్వెంట్ ఇంటర్నేషనల్అనే సంస్థ రూ.2,600 కోట్లు పెట్టుబడులు పెట్టింది.
హెల్త్ కేర్సెక్టార్ తర్వాత ఫిన్‌టెక్(ఫైనాన్సింగ్ టెక్నాలజీ) సెక్టార్లో పెట్టుబడులు 91 శాతం పెరిగి.. రూ.920 కోట్లుగా రిపోర్ట్ తేల్చింది. రాష్ట్రంలో 8,396 స్టార్టప్‌లు ఉండగా.. అందులో ఇప్పటికే రెండు సంస్థలు యూనికార్న్‌లుగా ఎదిగినట్టు పేర్కొంది. మరో 14 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారే దశలో (సూనికార్న్) ఉన్నట్టు వెల్లడించింది. మొత్తం స్టార్టప్‌ల ఫండ్ రైజ్రూ.30,234 కోట్లైతే.. అందులో రెండు యూనికార్న్‌ల ఫండ్‌రైజ్ రూ.21,032 కోట్లు కావడం విశేషం.
ఇతర మెట్రో సిటీలతో పోలిస్తే ఇంకా వెనకబాటే..
హైదరాబాద్ స్టార్టప్‌లకు ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతున్నా.. ఇతర మెట్రో సిటీలతో పోలిస్తే ఇంకా చాలా వరకు వెనకబడే ఉన్నట్టు ట్రాక్షన్రిపోర్ట్ పేర్కొంది. బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని స్టార్టప్‌లకు నిధులు అత్యధికంగా సమకూరుతున్నాయి. ఆ మూడు సిటీల్లో ఏటా రూ.30 వేల కోట్ల దాకా స్టార్టప్‌లకు పెట్టుబడులు అందుతున్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ సిటీ ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్నట్టు రిపోర్ట్ పేర్కొంది.