
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి. హైదరాబాద్ సిటీలోనూ 2024, జూన్ 6వ తేదీ సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. మరోసారి హైదరాబాద్ లో వాన దంచికొట్టనున్నట్లు వాతావవరణ శాఖ తెలిపింది. జూన్ 7వ తేదీ శుక్రవారం మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖహెచ్చరించింది.
భారీ వర్షం పడే ఛాన్స్ ఉండటంతో హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, సేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని అంచనా వేసింది. జూన్ 10 వరకు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. జూన్ 11 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో ప్రవేశించిన రుతుపవనాలు ముందుకు సాగుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటకలోని చాలా ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింతగా విస్తరించాయని ఐఎండీ జూన్ 6న ప్రకటించింది. వచ్చే 3-4 రోజుల్లో అరేబియాలోని అదనపు ప్రాంతాలు, కర్ణాటక, కోస్తా ఆంధ్రా, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు (ముంబయితో సహా), తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్ లో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.