- డేటింగ్ యాప్స్, వెబ్ సైట్లలో యువకులకు వల
- విదేశాల్లోని ఇండియన్సే టార్గెట్
- బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు
బషీర్ బాగ్, వెలుగు : లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన ఓ యువకుడు ఆన్లైన్లో సెక్స్టార్షన్ చేస్తూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. డీసీపీ దారా కవిత తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన రిద్ బేడీ(26) యూఎస్‌లోని కాలిఫోర్నియాలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. దాదాపు ఆరేండ్లు అక్కడ ఉన్నాడు. ఇండియాకు తిరిగొచ్చాక ఓ కంపెనీలో ప్రోడక్ట్ డిజైనర్ గా చేరాడు. కొంత కాలం తర్వాత జాబ్కోల్పోయాడు. అప్పటికే లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడిన రిద్బేడీ ఆన్లైన్ మోసాలకు తెర తీశాడు.
సీకింగ్.కామ్ వంటి డేటింగ్ వెబ్ సైట్ లో అమ్మాయిలాగా ఫేక్ప్రొఫైల్క్రియేట్చేసుకున్నాడు. దేశంతోపాటు విదేశాల్లోని ఇండియన్యువకులను టార్గెట్‌చేసి ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. చాటింగ్ లో బాధిత యువకుల పర్సనల్ ఫొటోస్ సేకరించి బ్లాక్ మెయిల్చేస్తున్నాడు. అడిగినంత డబ్బు పంపకపోతే బాధితుల ఫొటోలను వారి ఫ్రెండ్స్ , కుటుంబ సభ్యులకు పంపేవాడు. అమెరికా నుంచి ఇండియాకు డబ్బును స్పీడుగా ట్రాన్స్ఫర్చేయించుకునేందుకు ZELLE(జీల్లే) అనే ఆన్లైన్ట్రాన్స్ఫర్ఫ్లాట్ ఫాంను వినియోగించేవాడు.
ఎవరికీ చిక్కకుండా తరచూ ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు, ఆన్లైన్ప్రొఫైల్స్మార్చేవాడు. కాలిఫోర్నియాలోని తన కొడుకును ఓ వ్యక్తి మోసం చేశాడని ఇటీవల ఓ బాధితుడి తండ్రి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు పర్సనల్ ఫొటోస్ సేకరించి 1,721 యూఎస్ డాలర్లను కాజేశాడని తెలిపాడు. దర్యాప్తులో రిద్ బేడీని గుర్తించి విచారించగా అసలు విషయం బయటపడింది. జ్యుడీషియల్ కస్టడీ కోసం హైదరాబాద్ కు తరలించారు. ల్యాప్ టాప్, ఐ ఫోన్ మొబైల్, శ్యాంసంగ్ మొబైల్, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు.
రిద్ బేడీ బెంగళూరులో ఒంటరిగా ఉంటున్నాడు. ఆన్లైన్ గేమ్స్ కు బానిసగా మారాడు. బెంగళూరులో విలాసవంతమైన విల్లాలలో ఒకటైన అషిమా విల్లాలో నెలకు రూ.75 వేల అద్దె చెల్లిస్తున్నాడు. డేటింగ్ యాప్స్, సైట్లలో చాట్చేసే టైంలో ఎలాంటి టెక్నికల్ఇష్యూ రాకుండా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉపయోగించే 1000 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నాడు. ఇతను అమెరికా టైమింగ్స్‌ను ఫాలో అవుతూ పగలంతా నిద్రపోయేవాడు. రాత్రి వేళల్లో ఆన్లైన్ మోసాలకు పాల్పడేవాడు.