గచ్చిబౌలిలో ఆరు లైన్లతో.. మరో కొత్త ఫ్లై ఓవర్

గచ్చిబౌలిలో ఆరు లైన్లతో.. మరో కొత్త ఫ్లై ఓవర్

భాగ్యనగరం రోజురోజుకు విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగా వాహనాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం,  జీహెచ్‌ఎంసీతో కలిసి ఫ్లైఓవర్లను నిర్మిస్తోంది.  సిగ్నల్‌ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగుపరిచి వాహనదారులు సకాలంలో గమ్యస్థానానికి చేరడానికి ఎస్‌ఆర్‌డీపీ ద్వారా ఈ ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన గచ్చిబౌలి -కొండాపూర్ మధ్య ఆరు లేన్ల ద్వి దిశాత్మక ఫ్లైఓవర్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 

ఎంత అంచనా వ్యయం..

రద్దీగా ఉండే ఐటీ కారిడార్, బిజినెస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి గచ్చిబౌలి -కొండాపూర్ మధ్య ఆరు లేన్ల  ఫ్లైఓవర్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. రూ.178 కోట్ల అంచనా వ్యయంతో గచ్చిబౌలి జంక్షన్ రెండో లెవల్ క్రాసింగ్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ (ORR) వైపు ఈ  ఫ్లైఓవర్  రాబోతోంది.  ఈ ఫ్లైఓవర్ పొడవు 1.2 కిలో మీటర్లు,  వెడల్పు 24 మీటర్లు.  

ప్రయోజనాలేంటి..

గచ్చిబౌలి -కొండాపూర్ మధ్య చేపట్టిన ఈ  ఆరు లేన్ల ఫ్లైఓవర్ పూర్తయితే..గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ నుంచి వాహనదారులకు ఉపశమనం లభిస్తుంది. అలాగే  హైటెక్ సిటీ-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మెరుగైన కనెక్టివిటీ ఉంటుంది.

ఎప్పటిలోగా పూర్తయ్యే ఛాన్స్..

గచ్చిబౌలి -కొండాపూర్ ఐటీకారిడార్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు మార్చి 1న ప్రారంభమయ్యాయి. 2024  ఫిబ్రవరి 28  నాటికి ఈ  ఫ్లైఓవర్ నిర్మాణం  పూర్తి అవకాశం ఉంది. ప్రస్తుతం ఫ్లైఓవర్ పునాదుల పనులు కొనసాగుతున్నాయి.  అయితే  భూసేకరణ వల్ల నిర్మాణ  పనులు చేపట్టేందుకు రెండు నెలలు ఆలస్యం అయింది.