హైదరాబాద్ నగరంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. చెల్లెలి వివాహానికి హాజరై ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల అయిన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెళ్ళింట దొంగలు పడి దాదాపు 11 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు అపహరించారు దుండగులు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైయ్యాడు ఇంటి యజమాని. వివరాల్లోకి వెళ్లితే.. జవహర్ నగర్ పరిధిలోని సాకేత్ లో నివాసం ఉంటున్న శాస్త్రి అనే వ్యక్తి ఇంట్లో మే 13వ తేదీ శనివారం రాత్రి దొంగతనం జరిగింది.
సికింద్రాబాద్ లోని తన సోదరీ వివాహానికి వెళ్లిన శాస్త్రి..తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం ఇంటి వెనుక తలుపు తెరిచి ఉండడం గమనించాడు. దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. బెడ్రూంలో ఉన్న బీరువాలో నగదు, బంగారు ఆభరణాలు, ల్యాప్ టాప్ లు అపహరించినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి ఎదుట ఉన్న ద్విచక్ర వాహనాన్ని కూడా దొంగలించేందుకు ప్రయత్నించగా విఫలయత్నం జరిగినట్లు తెలిపారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.