యువతే లక్ష్యంగా నిషేధిత మత్తు పదార్థాలు అమ్ముతున్నారని బాలానగర్ ఎస్వోటీ పోలీసులు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి లో నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 130 గ్రాముల NDPS డ్రగ్,10కేజీల ఎండు గంజాయి, 8మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. విశ్వసనీయ సమాచారంతో బాలానగర్ ఎస్వోటీ పోలీసులు దాడి చేసి.. ఒడిశాకి చెందిన ప్రధాన నిందితుడు ఉమా శంకర్ తో పాటు ఆరుగురుని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని.. వీరిపై పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు వివరించారు. ప్రజలు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వారి పట్ల అప్రమత్తతతో ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని వెల్లడించారు.