
- ఎవరైనా డ్రోన్లు వాడాలన్నా పర్మిషన్ తప్పనిసరి
- ఇతర వర్గాలను కించ పరిచేలా పాటలు పెట్టొద్దు
- డీజేకు బదులు సౌండ్ సిస్టమ్ వాడాలి
- విగ్రహాల ఎత్తులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
- కోఆర్డినేషన్ మీటింగ్‌లో సిటీ సీపీ సీవీ ఆనంద్
మెహిదీపట్నం, వెలుగు: శ్రీరామ నవమి శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సిటీ సీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఈ నెల 6న శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకొని సీతారామ్ బాగ్ లోని ద్రౌపది గార్డెన్ లో అన్ని శాఖల అధికారులతో గురువారం ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. శోభాయాత్రకు సిటీ పోలీస్ అన్ని విభాగాలు, స్పెషల్ పోలీసులు కలిపి 20 వేల మందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. శోభాయాత్ర మార్గంలోని అన్ని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తుతోపాటు డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఎవరైనా డ్రోన్లు వాడాలన్నా ముందస్తుగా స్థానిక పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. శోభాయాత్రను మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
డీజేకు బదులు సౌండ్ సిస్టమ్ ను వినియోగించుకోవాలన్నారు. శోభాయాత్రలో ఇతర వర్గాలను కించ పరిచేలా పాటలు పెట్టొద్దని సూచించారు. విగ్రహాల ప్రతిమల ఎత్తులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం జీహెచ్ఎంసీ అడిషినల్ కమిషనర్ రఘు ప్రసాద్ మాట్లాడుతూ.. శ్రీరామనవమి శోభా యాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, ఇతర వసతుల ఏర్పాట్ల కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. మీటింగ్ అనంతరం భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి సభ్యులతో కలిసి శోభాయాత్ర రూట్‌మ్యాప్‌ను సీవీ ఆనంద్ పరిశీలించారు.
ఊరేగింపు - మంగళ్ హాట్ నుంచి ప్రారంభమై వయా పురానాపూల్ గాంధీ విగ్రహం, జుమేరాత్ బజార్, సిద్ది అంబర్ బజార్, అఫ్జల్ గంజ్, గౌలిగూడ, కోటి ఆంధ్రా బ్యాంకు చౌరస్తా, హనుమాన్ వ్యాయామ శాల గ్రౌండ్ లో ముగియనుందన్నారు. సమావేశంలో అడిషినల్ సీపీ లా అండ్ ఆర్డర్ విక్రమ్ సింగ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్, ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, ఉత్సవ కమిటీ సెక్రటరీ భగవంతు రావు, ఆర్గనైజర్ కృష్ణ పాల్గొన్నారు.
వీరహనుమాన్ విజయ యాత్ర పోస్టర్ రిలీజ్
ఖైరతాబాద్: ఈ నెల12న నిర్వహించే వీరహనుమాన్విజయ యాత్ర పోస్టర్‌ను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి, రాష్ట్ర ప్రచార ప్రముఖ్పగుడాకుల బాలస్వామి, బజరంగ్దళ్రాష్ట్ర కన్వీనర్శివరాములు కలిసి గురువారం ఆవిష్కరించారు. గౌలిగూడ హనుమాన్ మందిరం నుంచి తాడ్బండ్హనుమాన్ మందిరం వరకు ఏటా నిర్వహించే విజయ యాత్రను ఈసారి కూడా రెట్టింపు స్థాయిలో నిర్వహిస్తామన్నారు.
రాములోరి కల్యాణానికి ఆహ్వానం
హైదరాబాద్‌సిటీ: శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 6న సీతారాంబాగ్ లోని రామ మందిరంలో రాములోరి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొనాలని రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను గురువారం కలిసి ఆహ్వానించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఉత్సవ సమితి అధ్యక్షుడు డాక్టర్ భగవంతురావు, ప్రధాన కార్యదర్శి గోవిందరాటి, ఉపాధ్యక్షుడు మెట్టు వైకుంఠం ఉన్నారు.