హైదరాబాద్, వెలుగు: దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో హైదరాబాద్ సిటీ దూసుకుపోతోంది. రాజధానికి డొమెస్టిక్ టూరిస్టులు క్యూ కడుతున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ లో పర్యటించిన మొత్తం టూరిస్టుల్లో 7.10 శాతం హైదరాబాద్ కే వచ్చారు. దీంతో డొమెస్టిక్ టూరిజంలో హైదరాబాద్ టాప్–-5లో నిలిచింది. కేంద్ర పర్యాటక శాఖ దేశీయ పర్యాటకులను ఆకర్షించిన నగరాల జాబితాను నెలవారీగా విడుదల చేస్తుంది. తాజాగా కేంద్రం 2024-వ ఏడాదికి సంబంధించిన అక్టోబర్ నివేదికను రిలీజ్చేసింది. హైదరాబాద్ కు వస్తున్న టూరిస్టుల్లో అత్యధికంగా 44.98 శాతం మంది సెలవుల్లో సేద తీరేందుకే వస్తున్నట్లు ఈ రిపోర్ట్ తేల్చింది. వ్యాపారం కోసం వస్తున్న టూరిస్టులు 15.95 శాతం, టెంపుల్స్కు వచ్చే వారు 4.86 శాతం, చదవు కోసం వచ్చే వారు 1.81 శాతం మంది ఉన్నట్టు నివేదిక వెల్లడింది.
గతేడాది కంటే లక్ష ఎక్కువ..
దేశంలో డొమెస్టిక్ పర్యాటకులు గతేడాదితో పోలిస్తే 1,08,862 మంది పెరిగారు. 2023-అక్టోబర్ లో దేశీయ పర్యాటకుల సంఖ్య 22,65,957 మంది కాగా.. 2024-అక్టోబర్ లో 23,74,819 మందికి చేరుకున్నారు. వీరిలో హైదరాబాద్ కు 7.10 శాతం వచ్చినట్టు నివేదిక తెలిపింది. హైదరాబాద్ కు వస్తున్న వారిలో మహిళలు 33.60 శాతం కాగా పురుషులు 66.40 శాతం ఉన్నట్టు పేర్కొంది. జనవరి– -అక్టోబర్ మధ్య కాలంలో నగరానికి వచ్చిన మొత్తం పర్యాటకుల వివరాలను కూడా వెల్లడించింది. పది నెలల్లో 2.50 కోట్ల మంది పర్యటించగా గతేడాది ఇదే కాలంలో 23.31 కోట్ల మంది పర్యటించారు.