ఇంట్లో దొంగలు పడి నగదు ఎత్తుకెళ్లారని ఓ యువతి ఆడిన డ్రామాతో పోలీసులు పరుగులు పెట్టారు. రాజేంద్రనగర్ ఎర్రబోడకు చెందిన ఓ యువతి తన ఇంట్లో గురువారం ఉదయం వాష్‌రూమ్‌లో ఉండగా ఇద్దరు గుర్తు తెలియని దొంగలు మంకీ క్యాప్ లతో చొరబడి అల్మారాలోని రూ. 25 వేల నగదు ఎత్తుకెళ్లారని రాజేంద్రనగర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది.
తను గట్టిగా కేకలు వేసి దుండగులను పట్టుకునే యత్నం చేసినా పారిపోయారని మీడియాకు కూడా తెలిపింది. పోలీసులు వెళ్లి సీసీ కెమెరాల చెకింగ్ తో పాటు యువతిపై అనుమానంతో విచారించారు. దీంతో యువతి డ్రామా ఆడిందని తేలింది. ఆమె ఆన్‌లైన్‌లో గేమ్ ఆడి రూ. 25 వేల పోగొట్టుకుందని, దీంతో ఇంట్లో చెబితే కొడతారనే భయంతో డ్రామా క్రియేట్ చేసినట్లు పోలీసుల విచారణలో ఆమె వెల్లడించింది. కౌన్సిలింగ్ చేసి పంపినట్టు పోలీసులు తెలిపారు.