
తులం లక్ష రూపాయలు దాటిపోయి మధ్య తరగతి వర్గానికి షాకిచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై మంగళవారం 440 రూపాయలు పెరిగింది. దీంతో.. బంగారం ధర 97వేల 530 రూపాయల నుంచి 97 వేల 970 రూపాయలకు పెరిగింది.
22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 రూపాయలు పెరగడంతో 10 గ్రాముల ధర 89వేల 400 రూపాయల నుంచి 89 వేల 800 రూపాయలకు పెరిగింది. ఇక.. ఏప్రిల్లో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 29 వరకూ ఈ నెల రోజుల్లో బంగారం ధరల తీరుతెన్నులను ఒక్కసారి పరిశీలిస్తే.. మార్చి 29న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 91 వేల 200 రూపాయలుగా ఉంది.
ఏప్రిల్ 29న 97వేల 970 రూపాయలకు చేరింది. అంటే.. నెల రోజుల వ్యవధిలో.. బంగారం ధరలు 10 గ్రాములపై 6వేల 770 రూపాయలు పెరిగింది. ట్రంప్ దెబ్బకు యూఎస్ ఎకానమీ రెసిషన్‌లోకి జారుకుంటుందనే భయాలు ఉండడంతో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు ఆకర్షితులవుతున్నారు. మరోవైపు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్‌ను భారీగా కొనుగోలు చేస్తుండడంతో డిమాండ్ పెరుగుతోంది.
ఏప్రిల్ 30న అక్షయతృతీయ కావడం, పెళ్లిళ్ల సీజన్ అవడంతో వ్యాపారులు విపరీతంగా బంగారం కొంటుున్నారు. యూఎస్ డాలర్ బలహీనత, యూఎస్-చైనా వాణిజ్య యుద్ధం చుట్టూ ఉన్న అనిశ్చితులు బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు. భారత్లో బంగారం ధరలను అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారక రేట్ల హెచ్చుతగ్గులు ప్రభావితం చేస్తుంటాయి.