డిజిటల్ అరెస్ట్ పేరిట రూ.8.50 లక్షల మోసం

డిజిటల్ అరెస్ట్ పేరిట  రూ.8.50 లక్షల మోసం

బషీర్​బాగ్, వెలుగు: సైబర్​నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరిట ఓ ప్రభుత్వ ఉద్యోగిని మోసగించి, రూ.8.50 లక్షలు కాజేశారు.  హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి ట్రాయ్​అధికారి పేరిట ఫోన్​కాల్​వచ్చింది. మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేసి, ఇతరులకు షేర్ చేశావని చెప్పారు. దీనిపై బెంగళూరు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైందని, తమకు పట్టుబడిన సడకత్ ఖాన్ అనే నేరస్తుడి వద్ద నీ ఆధార్ కార్డు లభించిందని తెలిపారు. ఈ కేసులో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నావని, విచారణకు సహకరించాలని బెదిరించారు. 

మూడేళ్ల జైలుశిక్ష పడుతుందని, నకిలీ ఎఫ్ఐఆర్, సుప్రీంకోర్టు పత్రాలను బాధితుడికి పంపించారు. అనంతరం సీబీఐ అధికారులమంటూ వీడియో కాల్ చేశారు. ఆయన ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డు వివరాలు తెలుసుకున్నారు. అకౌంట్ లో ఉన్న డబ్బులు చట్టబద్ధంగా పొందినవో లేదో చెక్​చేస్తామని, తమకు ట్రాన్స్​ఫర్​ చేయాలంటూ నమ్మించారు. దీంతో, ఆయన తన యూనియన్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న మొత్తం రూ.8.50 లక్షలను RTGS ద్వారా ట్రాన్స్​ఫర్​చేశాడు. తర్వాత వారి నుంచి ఎలాంటి ఫోన్ కాల్​రాకపోవడంతో మోసపోయానని గ్రహించి, శుక్రవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.