- 691 స్కూళ్లలో183 రెంటెడ్ బిల్డింగుల్లోనే
- నెలకు రూ.16 లక్షలు కిరాయిలకే
- మరో 68 స్కూళ్లు కమ్యూనిటీ హాళ్లలో..
- సౌలత్లు లేక స్టూడెంట్లకు తిప్పలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్జిల్లాలో చాలా వరకు గవర్నమెంట్ స్కూళ్లకు పక్కా భవనాలు లేక కిరాయి భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అందులోనూ సరిపోను గదులు, సౌలత్లు లేక స్టూడెంట్లుఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 691 ప్రభుత్వ స్కూళ్లుఉండగా,183 స్కూళ్లు కిరాయి భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 400 స్కూళ్లు పక్కా భవనాల్లో ఉండగా, 68 కమ్యూనిటీ హాళ్లలో నిర్వహిస్తున్నారు.
మరికొన్నింటిని తాత్కాలికంగా ఇతర ప్రభుత్వ బిల్డింగుల్లో నడిపిస్తున్నారు. వీటి కోసం ప్రభుత్వం ప్రతి నెలా సుమారు రూ.16 లక్షల వరకు కిరాయి చెల్లిస్తున్నది. కొన్ని స్కూళ్లకు ఖాళీ స్థలాలున్నా.. అవి కోర్టు కేసుల్లో ఉండడంతో నిర్మాణాలకు నోచుకోవడం లేదు. అధికారులు చొరవ చూపి, స్కూళ్లకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్, పేరెంట్స్ కోరుతున్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ నోచుకోక...
సర్కారు బడుల్లో సౌలత్లు కల్పించేందుకు కాంగ్రెస్ప్రభుత్వం ఇటీవల అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని 384 స్కూళ్లలో రూ.30 కోట్లతో సౌలత్లు కల్పిస్తున్నారు. టాయిలెట్లు, ఎలక్ట్రికల్, సివిల్ వర్క్స్చేయిస్తున్నారు. కిరాయి భవనాల్లో కొనసాగుతున్న స్కూళ్లను మాత్రం ఈ స్కీమ్ జాబితాలో చేర్చకపోవడంతో అక్కడి విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇరుకు గదులకు తోడు, సరిపోను టాయిలెట్స్ లేక తిప్పలు పడుతున్నారు.