- రాణించిన భువనేశ్వర్ కుమార్
- లక్నోపై పది వికెట్లతో హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ
- 9.4 ఓవర్లలోనే టార్గెట్ ఛేజ్ చేసిన రైజర్స్
హైదరాబాద్, వెలుగు: సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ టాప్ గేర్‌లోకి వచ్చేసింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిన రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసులో కీలక పోరులో పంజా విసిరింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (30 బాల్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 నాటౌట్), అభిషేక్ శర్మ (28 బాల్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో 58 బాల్స్‌లోనే టార్గెట్‌ను కరిగించి లక్నో సూపర్ జెయింట్స్ మైండ్ బ్లాంక్ చేసింది. ఉప్పల్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసింది.
తొలుత ఎల్‌ఎస్‌జీ 20 ఓవర్లలో 165/4 స్కోరు చేసింది. ఆయుష్ బదోనీ (30 బాల్స్‌లో 9 ఫోర్లతో 55 నాటౌట్), నికోలస్ పూరన్ (26 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 48 నాటౌట్) రాణించారు. భువనేశ్వర్ (2/12) రెండు వికెట్లు పడగొట్టాడు. హెడ్, అభిషేక్ జోరుతో సన్ రైజర్స్ 9.4 ఓవర్లలో 167/0 స్కోరు చేసి గెలిచింది. హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో 14 పాయింట్లతో సన్ రైజర్స్ మూడో ప్లేస్‌కు వచ్చింది. లక్నో (12) ఆరో ప్లేస్‌కు పడిపోగా.. ముంబై (8) ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా వైదొలిగింది.
సూపర్ బౌలింగ్
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన లక్నోను హైదరాబాద్ బౌలర్లు పవర్ ప్లేతో పాటు తొలి సగం ఓవర్లలో గొప్పగా నిలువరించారు. మొదటి ఏడు ఓవర్లలో ఒకే ఒక్క బౌండ్రీ (సిక్స్) మాత్రమే వచ్చిందంటే బౌలింగ్ ఎంత పదునుగా ఉందో చెప్పొచ్చు. బదోనీ, పూరన్ మెరుపులతో లక్నో ఆ మాత్రం స్కోరు చేసింది. పవర్ ప్లేలోనే మూడు ఓవర్లు వేసిన భువనేశ్వర్ సూపర్‌గా బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్లో మూడే రన్స్ ఇచ్చాడు. కమిన్స్ వేసిన రెండో ఓవర్లో రాహుల్ (29) సిక్స్ రాబట్టినా.. భువీ బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ బౌండ్రీ లైన్ వద్ద తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ తన బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ పట్టిన సూపర్ క్యాచ్‌కు డికాక్ (2) ఔటయ్యాడు.
భువీ తర్వాతి ఓవర్లో హిట్టర్ స్టోయినిస్ (3) మిడాన్ మీదుగా పుల్ చేసిన బాల్‌ను సన్వీర్ సింగ్ అమాంతం గాల్లో డైవ్ చేస్తూ పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, విజయకాంత్ కూడా కట్టడి చేయడంతో 7 ఓవర్లకు 30/2 స్కోరుతో నిలిచింది. ఉనాద్కట్ వేసిన ఎనిమిదో ఓవర్లో క్రునాల్ పాండ్యా (24) వరుసగా రెండు సిక్సర్లతో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. రాహుల్‌ను పదో ఓవర్లో పెవిలియన్ చేర్చిన కమిన్స్... నట్టూ వేసిన 13వ ఓవర్లో డైరెక్ట్ హిట్‌తో క్రునాల్‌ను రనౌట్ చేయడంతో లక్నో 65/4తో డీలా పడింది.
ఈ దశలో నికోలస్ పూరన్‌కు తోడైన ఆయుష్ బదోనీ.. నటరాజన్ వేసిన 14వ ఓవర్లో మూడు ఫోర్లతో ఇన్నింగ్స్‌లో చలనం తీసుకొచ్చాడు. ఆ వెంటనే పూరన్ సిక్స్, బదోనీ మరో ఫోర్ రాబట్టడంతో 15 ఓవర్లకు స్కోరు వంద దాటింది. స్లాగ్ ఓవర్లలోనూ పూరన్, బదోనీ జోరు చూపెట్టారు. నట్టూను టార్గెట్ చేసిన బదోనీ అతని వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లతో ఆకట్టుకున్నాడు. కమిన్స్ వేసిన ఆఖరి ఓవర్లో బదోనీ ఒకటి, పూరన్ మూడు ఫోర్లు రాబట్టి స్కోరు 160 దాటించారు.
47 నిమిషాల్లోనే ఖేల్‌ఖతం
ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తిరిగి ఫామ్‌లోకి వచ్చి తమ మార్కు విధ్వంసం సృష్టించడంతో చిన్న టార్గెట్‌ను సన్ రైజర్స్ ఈజీగా ఛేజ్ చేసింది. వీళ్ల దెబ్బకు సన్ రైజర్స్ 47 నిమిషాల్లో.. 58 బాల్స్‌లోనే ఛేజింగ్‌ను ముగించింది. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకొని ఈ ఇద్దరూ భారీ షాట్లతో చెలరేగారు. తొలి ఓవర్ ఆఖరి బాల్‌కు ఫోర్‌తో హెడ్ బౌండ్రీల ఖాతా తెరవగా.. యశ్ ఠాకూర్ వేసిన రెండో ఓవర్లో అభిషేక్ నాలుగు ఫోర్లతో జోరందుకున్నాడు. కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో హెడ్ 6, 4, 6, 6తో రెచ్చిపోయాడు.
నాలుగో ఓవర్లో బిష్ణోయ్‌కు అభిషేక్ సిక్స్.. హెడ్ 4, 6తో స్వాగతం పలికారు. ఈ ఓవర్లో అభిషేక్ ఇచ్చిన టఫ్ క్యాచ్‌ను యశ్ ఠాకూర్ డ్రాప్ చేశాడు. జోరు కొనసాగించిన హెడ్... నవీన్ వేసిన ఐదో ఓవర్లో 4, 4, 6, 4, 4తో దంచికొట్టి 16 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆరో ఓవర్లో అభిషేక్ 4, 6, 4,6 బాదడంతో పవర్‌ప్లేలోనే స్కోరు వంద దాటింది. ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా ఓపెనర్ల బాదుడులో ఏమాత్రం తేడా రాలేదు. లక్నో కెప్టెన్ రాహుల్ ఏడో ఓవర్లో బదోనీని బౌలింగ్‌కు దింపగా హెడ్ సిక్స్, అభిషేక్ 6,4 కొట్టి 19 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అదే జోరుతో యశ్ ఠాకూర్ వేసిన పదో ఓవర్ నాలుగో బాల్‌ను ఎక్స్‌ట్రా కవర్ మీదుగా సిక్స్‌గా మలచి అభిషేక్ మ్యాచ్‌ను ముగించాడు.