
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించనుంది. జంట పేలుళ్ల కేసులో అయిదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా, మిగిలిన అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్, మహమ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్, మహమ్మద్ అహ్మద్ సిద్ధిబప అలియాస్ యాసిన్ భత్కల్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అయిదుగురికి ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది.
దీన్ని ధ్రువీకరించేందుకు ఎన్‌ఐఏ కోర్టు హైకోర్టుకు (రెఫర్డ్ అప్పీలు) నివేదించింది. దీంతో అయిదుగురు నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి.శ్రీసుధలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించనుంది. కాగా, దిల్ సుఖ్ నగర్ లో 2013, ఫిబ్రవరి 21న బస్టాప్, మిర్చి పాయింట్ వద్ద పేలుళ్లు చోటు చేసుకోగా 18 మంది మరణించారు.