హైదరాబాద్ సిటీలో వర్షం మళ్లీ మొదలైంది. తగ్గినట్లే తగ్గి.. మళ్లీ దంచికొడుతున్న వాన. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ ఏరియాల్లో భారీ వర్షంతో జనం బెంబేలెత్తుతున్నారు. భారీ వర్షంతో ఇప్పటికే రోడ్లు జలమయం అయ్యాయి.. లోతట్టు ప్రాంతాల్లో ఇంకా నీళ్లు అలాగే ఉన్నాయి.. ఇలాంటి టైంలో మళ్లీ వర్షం మొదలుకావటంతో వణికిపోతున్నారు సిటీ జనం.
2024, ఆగస్ట్ 20వ తేదీ మంగళవారం ఉదయం వరకు పడిన భారీ వర్షంతోనే అల్లాడిపోయారు జనం. మధ్యాహ్నానికి ఎండ రావటంతో ఊపిరిపీల్చుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి మళ్లీ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, దుండిగల్, గండి మైసమ్మ, షాపూర్ నగర్, సుచిత్ర, పెట్ బషీరాబాద్, గుండ్ల పోచంపల్లి, జీడిమెట్ల, సూరారం, అబిడ్స్ , బషీర్ బాగ్ , హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డి కపుల్ ప్రాంతాల్లో వర్షం పడుతుంది.
సిటీలోని మిగతా ఏరియాల్లో వాతావరణం చల్లబడింది. జల్లులు పడుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావటంతో ఉద్యోగులు అంతా టెన్షన్, హైరానా పడుతున్నారు.
ట్రాఫిక్ నరకం నుంచి బయటపడిన కొన్ని గంటల్లోనే మళ్లీ వర్షంతో ఎక్కడ ట్రాఫిక్ లో చిక్కుకుంటామో అనే భయం వెంటాడుతుంది.