![గురుమూర్తికి తల్లి, చెల్లి, తమ్ముడు కూడా సహకరించారట.. రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయే విషయాలు..](https://static.v6velugu.com/uploads/2025/02/hyderabad-horror-guru-murthy-family-cooperates-him-to-eliminates-his-wife-in-meerpet_PNuFWqOl1m.jpg)
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట్ వెంకట మాధవి హత్య కేసులో కీలక నిజాలు వెలుగులోకి వచ్చాయి. మాధవిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఆమె భర్త గురుమూర్తి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు తెలిశాయి. మాధవి హత్యకు కుట్ర పన్నిన గురుమూర్తికి అతని తల్లి సుబ్బలక్ష్మమ్మ, చెల్లెలు సుజాత, తమ్ముడు కిరణ్ కూడా సహకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు.
సాక్ష్యాలు మాయం చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. పంచాయితీ పెట్టి పరువు తీసిందని మాధవిపై గురుమూర్తి కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పధకం పన్నాడు. ‘నాకు మీ చెల్లెలి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు’ అని గురుమూర్తితో మాధవి చెప్పింది. దీంతో.. పిల్లలని అక్కడే వదిలి భార్యని నిందితుడు గురుమూర్తి ఇంటికి తీసుకెళ్లాడు.
జనవరి15వ తేదీన చెల్లెలి ఇంటి వద్ద పిల్లలను వదిలేసిన గురుమూర్తి భార్యతో కలిసి ఇంటికి చేరాడు. జనవరి16 వ తేదీన పుట్టింటికి వెళ్తానన్న భార్యతో గురుమూర్తి గొడవ పడ్డాడు. తనని పుట్టింటికి ఎందుకు పంపడం లేదని మాధవి ప్రశ్నించింది. వివాదం పెరగడంతో మాధవి గొంతు నులిమి గురుమూర్తి హత్య చేశాడు. అదే రోజు భార్యను హత్య చేసి ముక్కలు చేశాడు.
మాధవి మృతదేహం ముక్కలను నీటిలో హీటర్తో గురుమూర్తి ఉడికించాడు. ఎముకలను పొడి చేసి మిగిలిన మాంసం ముక్కలను బకెట్లో వేసి గురుమూర్తి పెద్ద చెరువులో పడేశాడు. జనవరి18 న కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు మాధవి తల్లి ఫిర్యాదు చేసింది. భర్తతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని కంప్లైంట్ చేయడంతో, మీర్ పేట పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
ALSO READ | యాక్సిడెంట్లో మహిళా డాక్టర్ బ్రెయిన్ డెడ్.. నాలుగు కుటుంబాల్లో వెలుగులు నింపేసింది..
మాధవి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా వెతికారు. ఇంటి సమీపంలో సీసీ కెమెరాలలో గురుమూర్తి కదలికలు, మాధవి కదలికలు రికార్డు కావడం గమనార్హం. 15వ తేదీ మాధవి ఇంట్లోకి వెళ్ళిన దృశ్యాలు కనిపించాయి. ఆ సీసీ కెమెరాల్లో ఆమె కనిపించడం అదే చివరిసారి. ఆ తర్వాత ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్లు గానీ, బయటకు వెళ్లి మళ్లీ ఇంట్లోకి వెళుతున్నట్లు గానీ సీసీ కెమెరాల్లో కనిపించలేదు. జనవరి16 న గురుమూర్తి తన ఇంట్లో నుంచి బకెట్తో బయటకు రావడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీంతో పోలీసులకు అనుమానమొచ్చింది. గురుమూర్తిని పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు.
జనవరి 28 న తానే మాధవిని హత్య చేశానని మాధవి తండ్రికి గురుమూర్తి చెప్పేశాడు. మాధవి తండ్రి వెంకటరమణ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గురుమూర్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా తానే హత్య చేశానని పోలీసుల ముందు కుండబద్ధలు కొట్టాడు. ఆధారాల కోసం పెద్ద గజ ఈత గాళ్ళతో చెరువులో మీర్ పేట పోలీసులు వారం రోజులు వెతికించారు. మాంసం ముక్కలు పడేసిన బకెట్ పోలీసులకు లభ్యమైంది. ఇంటి చుట్టుపక్కల వారితో మాట్లాడిన పోలీసులు సాక్ష్యాలను సేకరించారు.
హత్య జరిగిన మరుసటి రోజు గురుమూర్తి ఇంటి నుంచి కమురు వాసన వచ్చిందని చుట్టుపక్కల వారు పోలీసులకు చెప్పారు. అలా ముక్కలు ఉడికిస్తున్నప్పుడు ఇంట్లో నుంచి వాసన రావడంతో పక్కింట్లో అద్దెకు ఉంటున్న సదాశివుడు గురుమూర్తిని అడిగాడు. ఇంట్లో నాన్ వెజ్ కూర వండుతున్నానని వారికి గురుమూర్తి చెప్పాడు. తనకు ఇలాగే ఏదో కాలిన వాసన వస్తోందని పైన పెంట్ హౌజ్లో ఉంటున్న రత్లావత్ పుష్ప కూడా పోలీసులకు చెప్పింది. బాత్ రూమ్లో మృతదేహం ముక్కలు కనిపించాయి. ఉడికించిన వ్యర్దాలను కమోడ్లో వేసిన గురుమూర్తి ఫ్లష్ చేశాడు. ఇల్లు వాసన రాకుండా ఉండేందుకు గురుమూర్తి ఫినాయిల్తో శుభ్రం చేశాడు. నిందితుని ఇంటి నుంచి కత్తి, రంపం, స్టవ్, ఫినాయిల్ సీసాలు, ఖాళీ పెయింట్ బకెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.