- బిర్యానీలో జెర్రి.. టిఫిన్‌లో జిల్ల పురుగు
- ఫుడ్ కలర్స్ మాటున కనబడనివి ఎన్నో
- హోటల్ ఫుడ్ తో రోగం గ్యారెంటీ
- మిగిలిన చికెన్.. మటన్‌తో వెరైటీ వంటకాలు
- ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల దాడులు, జరిమానాలు
యాదాద్రి, వెలుగు : భువనగిరిలోని ఓ హోటల్ వర్కర్.. కూరగాయలు కొనడానికి రైతుబజార్‌కు వచ్చాడు. ఓ షాపులోకి వెళ్లి కస్టమర్లు కొనుగోలు చేయగా మిగిలిపోయిన కూరగాయలు తక్కువ ధరకు తీసుకున్నాడు. ఆ కూరగాయలనే హోటల్‌కు తీసుకెళ్లాడు. మరోవైపు భువనగిరి బైపాస్ రోడ్డులో ఉన్న వివేరా హోటల్‌కు ఓ కస్టమర్ వెళ్లాడు. చికెన్ బిర్యానీకి ఆర్డర్ ఇచ్చాడు. అది తింటుండగా దాంట్లో జెర్రి వచ్చింది. దీంతో కస్టమర్ హోటల్వర్కర్స్తో వాగ్వాదానికి దిగాడు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ దృష్టికి వెళ్లింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ హోటల్స్‌పై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు దాడులు చేసి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. భువనగిరి బస్టాండ్సమీపంలోని శివ హోటల్లో ఓ కస్టమర్ టిఫిన్ చేస్తుండగా జిల్ల పురుగు వచ్చింది. సదరు కస్టమర్ ఫిర్యాదు చేశాడు. ఆ హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు దాడులు చేసి శాంపిల్స్ సేకరించడంతోపాటు రూ.15 వేలు జరిమానా విధించారు.
నాసిరకమైన సరుకులతో..
ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో కొందరు హోటల్స్‌కు వెళ్లి టిఫిన్స్, భోజనం చేయడం అలవాటు. ఆ అలవాటును కొన్ని హోటళ్ల యజమానులు క్యాష్ చేసుకుంటున్నారు. నాసిరకమైన సరుకులతో వంట చేసి.. సింథటిక్ కలర్స్, మసాల దట్టించి తయారు చేస్తున్నారు. మసాల ఘాటుతో వేడివేడిగా వచ్చిన ఫుడ్స్‌ను కస్టమర్స్తినేస్తున్నారు. కొందరైతే మిగిలిపోయిన బిర్యానీ సహా ఇతర ఫుడ్స్‌ను ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో భద్రపరిచి మరుసటి రోజు తినేస్తున్నారు. ఇక వంట నూనె మాత్రం మార్చకుండా పాత నూనెలో కొత్తగా నూనె పోసి వాడుతున్నారు. ఇలాంటి ఫుడ్స్ కారణంగా అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు.
అయినా లాభాపేక్షతో హోటల్ బిజినెస్‌లో ఉన్న కొందరు పట్టించుకోవడం లేదు. అయితే ఏ హోటల్‌కు వెళ్లినా.. బయట ఎంతో నీట్‌గా కన్పిస్తుంటాయి. కానీ కొన్ని హోటల్స్ కిచెన్‌కు వెళ్తే.. అపరిశుభ్రంగా ఉంటాయి. వంట గిన్నెలపై మూతలు ఉండవు. ఈగలు, జిల్ల పురుగులు, ఎలుకలు పరిగెడుతూ ఉంటాయి. క్లీన్‌చేసే చీపురు పట్టుకున్న చేతితోనే గరిట పట్టుకొని వంట చేస్తుంటారు. ఇక వంట చేసే మాస్టర్ల అవతారం చూస్తే ఆ హోటల్స్‌లో ఏమి తినలేం. ఫుడ్ కలర్స్కలుపుతూ ఉండడం వల్ల ఫుడ్స్‌లో ఏదైనా ఉన్నా కన్పించదు.
బిర్యానీలో జెర్రి.. టిఫిన్‌లో జిల్ల పురుగు..
కిచెన్‌లో అపరిశుభ్రత కారణంగా ఎలుకలు, జిల్ల పురుగులు(బొద్దింకలు), బల్లుల వంటివి తిరుగుతూ ఉంటాయి. వంట గిన్నెలపై మూతలు సరిగా లేకుంటే అవి అందులో పడిపోతాయి. ఇటీవల భువనగిరిలోని రెండు హోటల్స్‌లోని ఫుడ్స్‌లో ఇదే విధంగా జెర్రి, జిల్ల పురుగు చేరాయి. హోటల్ వివేరాలో చికెన్ బిర్యానీ తింటున్న కస్టమర్‌కు జెర్రి కన్పించగా, శివ ఉడిపి హోటల్లో టిఫిన్ చేస్తున్న కస్టమర్‌కు జిల్ల పురుగు కన్పించింది. దీంతో హోటల్స్ నిర్వాహకులతో కస్టమర్లు వాగ్వాదం చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్తా హయ్యర్ ఆఫీసర్ల దృష్టికి వెళ్లింది.
ఫ్రిజ్‌లో బిర్యానీ.. మిగిలిన చికెన్‌తో..
హయ్యర్ఆఫీసర్ల ఆదేశాల మేరకు పలు హోటల్స్‌పై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రతి హోటల్లోని కిచెన్లు అపరిశుభంగా ఉండడాన్ని ఆఫీసర్లు గుర్తించారు. గత నెలలో హోటల్ వివేరాపై దాడులు నిర్వహించి ఎక్స్పైర్తేదీ లేని వస్తువులను ధ్వంసం చేశారు. నోటీసులు జారీ చేసి ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల భువనగిరి టౌన్‌లోని మధురం హోటల్లో ఫ్రిజ్‌లో బిర్యానీ నిల్వ చేసి ఉంచారు.
ఇదేమని ఆఫీసర్లు ప్రశ్నిస్తే తమ హోటల్లో పని చేసేవారి కోసమంటూ సమాధానం చెప్పుకున్నారు. దీంతో సదరు హోటల్ యజమానికి రూ.15 వేలు ఫైన్ వేశారు. శివ హోటల్‌పై దాడులు నిర్వహించగా అపరిశుభ్రంగా ఉండడంతో రూ.15 వేలు ఫైన్ విధించారు. మండి హౌస్‌లో బిర్యానీ తయారీలో సింథటిక్ కలర్స్ఉపయోగించినట్టు తేలింది. దీంతో బిర్యాని, చికెన్ ముక్కలను డస్ట్‌బిన్‌లో పారవేయించి రూ.5 వేలు ఫైన్ వేశారు. గతంలో పలుమార్లు అధికారులు దాడులు నిర్వహించినా హోటల్స్ నిర్వాహకుల్లో మాత్రం మార్పు
రావడం లేదు.
రూ.80 వేలు ఫైన్.. చెల్లించని యజమాని..
భువనగిరి బైపాస్‌రోడ్డులోని ఓ హోటల్‌పై గతంలో ఫిర్యాదు వచ్చింది. దీంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఉండడంతోపాటు ఆహార పదార్థాల్లో తేడా కనిపెట్టి శాంపిల్స్సేకరించి నోటీసు జారీ చేశారు. సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించగా కల్తీ జరిగినట్టు రిపోర్ట్ వచ్చింది. దీంతో సదరు హోటల్యజమానికి రూ. 80 వేలు ఫైన్ వేశారు. అయితే ఆరు నెలలు గడిచినా.. ఇప్పటివరకు సదరు హోటల్ యజమాని ఫైన్ చెల్లించలేదు. హోటల్ మాత్రం నడుస్తూనే ఉంది.