- ఫైర్ సేఫ్టీ పాటించకుండా క్రాకర్స్ అమ్మకాలు
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీ/ బషీర్ బాగ్, వెలుగు: అబిడ్స్‌లోని బొగ్గులకుంటలో అగ్ని ప్రమాదానికి గురైన పారస్ క్రాకర్స్ షాపును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం పరిశీలించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాద కారణాలను స్థానికులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన చోట పారస్ క్రాకర్స్ షాపునకు సరైన లైసెన్స్ లేదని, సమీపంలోని బహిరంగ ప్రదేశంలో దీపావళి సందర్భంగా షాపును ఏర్పాటు చేసుకోవడానికి తాత్కాలిక అనుమతులు తీసుకున్నట్లు చెప్పారు.
మరోవైపు, పారస్ క్రాకర్స్ షాపు యజమాని గురువిందర్ సింగ్‌పై సుల్తాన్ బజార్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ దుకాణానికి ఆనుకొని ఉన్న తాజా టిఫిన్స్ యజమాని గురుకుంట్ల విజయ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్ కింద నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస చారి తెలిపారు. లైసెన్స్‌తోపాటు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా షాప్ ఏర్పాటు చేసిన గురువిందర్ను త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
తాత్కాలికంగా లైసెన్స్ రద్దు
పారస్ క్రాకర్స్ షాపు తాత్కాలిక లైసెన్స్‌ను రద్దు చేసినట్టు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా దుకాణాల ఏర్పాటుకు పర్మినెంట్, టెంపరరీ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,953 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఇందులో 6,104 అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. మరో 676 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. సరిగ్గా సమాచారంలేని 173 దరఖాస్తులను రద్దు చేశామని పేర్కొన్నారు. అనధికారికంగా ఎవరైనా బాణసంచా విక్రయిస్తున్నట్టు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
వివాదాస్పద పార్కు స్థలం పరిశీలన
వెంగళరావునగర్‌లోని - మోతీనగర్ మార్గంలో వివాదాస్పద పార్కు స్థలాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం పరిశీలించారు. నలంద స్కూల్‌కు చేరువలో ఉన్న 9800 చదరపు గజాల స్థలం పార్కు కోసం కేటాయించారని, దీనిని తమదంటూ కొంతమంది ఆక్రమించి ఉన్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులతో పాటు స్థానికుల సమక్షంలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. స్థలం తమదని చెబుతున్న వ్యక్తులు పత్రాలను తీసుకుని వస్తే విచారించి, ఆ స్థలం పార్కు కోసం కేటాయించారా? లేక ప్రభుత్వ స్థలమా? ప్రైవేటు వ్యక్తులదా అనేది నిర్ధారిస్తామని రంగనాథ్ చెప్పారు.