హైడ్రా ప్రజావాణికి 64 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణికి 64 ఫిర్యాదులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమ‌వారం నిర్వహించిన ప్రజావాణికి 64 ఫిర్యాదులు అందాయి. క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ ఫిర్యాదులను స్వీకరించారు. మ‌ల్కాజిగిరి స‌ర్కిల్‌ ఆర్‌.కె.పురం ఆఫీస‌ర్స్​కాల‌నీలో 3 వేల గ‌జాల పార్కు స్థలం క‌బ్జాకు గురైంద‌ని ఆర్మీ ఆఫీస‌ర్ల కాల‌నీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.  

కూక‌ట్‌ప‌ల్లిలోని సుభోధ, స్వగృహ హౌసింగ్ సొసైటీలో, ఆదిత్యన‌గ‌ర్‌లో ప్రజావసరాలకు వదిలిన స్థలాలు, అంభీర్ చెరువు కబ్జాకు గురైందని ఆయా కాల‌నీల సంఘాల ప్రతినిధులు అర్జీలు ఇచ్చారు. పోచారం మున్సిపాలిటీ ఏక‌శిలాన‌గ‌ర్ కాల‌నీలో పార్కు స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని, కాల‌నీకి వెళ్లే 50 ఫీట్ల రోడ్డును 15 అడుగుల మేర స్థానిక ఇంజినీరింగ్ కాలేజీ వారు ఆక్రమించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. 

జయపురికాలనీలో జోరుగా కబ్జాలు 

పోచారం మున్సిపాలిటీ ఘట్ కేసర్ ఓఆర్ఆర్​పక్కన సర్వీస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న జయపురికాలనీ సర్వే నెంబర్ 563, 559 లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, రోడ్లు, పార్కు స్థలాల కబ్జాలపై పలువురు ప్లాట్ల యజమానులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాధితులు, ప్లాట్ల యజమానులు మామిడి సోమయ్య,  ఏనుగు రామారావు, జగదీశ్​కుమార్, లలిత, శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1968లో పంచాయతీ అనుమతితో 56.35 ఎకరాల్లో వేసిన జయపురి కాలనీ లే-అవుట్​పై ఇటీవల కొందరు భూకబ్జాదారులు, రియల్టర్లు,స్థానిక రాజకీయ నాయకులు కన్నుపడిందన్నారు. సింగిరెడ్డి రాంరెడ్డి, కోలా మహేశ్, దుర్గారెడ్డి, బాబా, మాధవరెడ్డి, వెంకటేశ్వర రావు అనే ఆరుగురు ప్లాట్లు, రోడ్లు, పార్కులను కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని ఫిర్యాదు చేశారు.