హైదరాబాద్​కు వచ్చే కూరగాయలు 84 శాతం ఇతర రాష్ట్రాల నుంచే

హైదరాబాద్​కు వచ్చే కూరగాయలు 84 శాతం ఇతర రాష్ట్రాల నుంచే

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతోపాటు పక్క రాష్ట్రాల నుంచి పలు రకాల కూరగాయలు దిగుమతి అవుతాయి. తెలంగాణలో పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ధరలకు రెక్కలు వచ్చాయి.  హైదరాబాద్​బోయిన్​పల్లి మార్కెట్​కు ఇప్పుడు వచ్చే కూరగాయల్లో 84 శాతం  ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాల నుంచే వస్తుండగా.. తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం 16 శాతం మాత్రమే కూరగాయలు హైదరాబాద్​ మార్కెట్​కు వస్తున్నాయి.

 2024, జూన్ 19వ తేదీ బోయిన్​పల్లి మార్కెట్​కు  23 వేల 840 క్వింటాళ్ల కూరగాయలు మాత్రమే వచ్చాయి. సాధారణంగా దీనికి రెండు, మూడు రెట్లు వస్తే కానీ మనకు సరిపోయే పరిస్థితి ఉండదని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి.

కూరగాయల కొరతతో చాలా వరకు ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.  వచ్చిన వాటిలోనూ డిమాండ్​ ఉన్న కూరగాయలు చాలా తక్కువగా వచ్చాయి. బెండ, బీర, కాకర వంటి అందుబాటులో ఉండే కూరగాయలు కూడా తక్కువ వస్తున్నాయి.  ఫలితంగా కూరగాయలు అధిక ధరలు పలుకుతున్నాయి. ఆలుగడ్డ, సొరకాయ, క్యారెట్​వంటివే వెయ్యి క్వింటాళ్లకు పైగా వచ్చాయి. 

ఎండ తీవ్రత తగ్గినా ఇతర కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. పచ్చిమిర్చి కిలో  ధర రూ.120కి పైగానే పలుకుతున్నది. వంద రూపాయలకు మూడు, నాలుగు కిలోలు వచ్చే ఉల్లిగడ్డ  ప్రస్తుతం రూ.50కి కిలో చొప్పున విక్రయిస్తున్నారు. ఆకుకూరలను సైతం కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఏ ఆకుకూర తీసుకున్నా.. నిన్న మొన్నటివరకు రూ.20కి నాలుగు కట్టల వరకు ఇవ్వగా..ప్రస్తుతం రెండు, మూడు కట్టలే చేతిలో పెడుతున్నారు. మార్కెట్​లో ఏ కూరగాయ కొనాలన్నా పావు రూ.20 చెబుతుండడంతో.. రెగ్యులర్​గా కిలోల చొప్పున కొనే వినియోగదారులు ధరలు చూసి  అరకిలో, పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. 

బహిరంగ మార్కెట్​లో కూరగాయల ధరలు

ప్రెంచ్​ బీన్స్    175 –210
టమాటా    100–120
పచ్చిమిర్చి    100–120
దొండకాయ    70–80
బీరకాయ    80–100
బెండకాయ    80–100
కాకరకాయ    80
క్యారెట్‌‌‌‌    80 
చామదుంప    60