బల్దియా కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతల ఆందోళన
హైదరాబాద్, వెలుగు: ‘హైదరాబాద్ పానీమే.. కేసీఆర్ ఫామ్‌హౌస్ మే’ అంటూ కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు శుక్రవారం ఆందోళనకు దిగారు. వరద నీటిలో ప్రజలు అల్లాడిపోతుంటే సీఎం కేసీఆర్ కోట దాటడంలేదంటూ మండిపడ్డారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ.. 1938లో మూసీ వరదలొస్తే నిజాం నవాబు ప్రజలను ఆదుకున్నాడని, నయా నవాబు కేసీఆర్ మాత్రం బయటకు కూడా రాలేదని విమర్శించారు. హైదరాబాద్‌ను రూ. 64 వేల కోట్లతో అభివృద్ధి చేసినట్లు కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారని.. ఎక్కడ చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. సర్వే చేయకుండానే రూ. 5 కోట్ల నష్టం జరిగిందని కేసీఆర్, కేటీఆర్ చెప్పడమేంటని మండిపడ్డారు. వరదల్లో చిక్కుకున్న వారికి కనీసం అన్నం కూడా సర్కారు అందిచడం లేదని దుయ్యబట్టారు. తర్వాత కమిషనర్‌కు మెమోరాండం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్, బండ చంద్రారెడ్డి, ఫెరోజ్ ఖాన్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులున్నారు.
వీ6 రిపోర్టర్‌పై పోలీసుల జులుం
కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న ఆందోళనను కవర్ చేసేందుకు వెళ్లిన వీ6 రిపోర్టర్‌పై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యూస్ కవర్ చేయకుండా నెట్టేశారు. పోలీసుల తీరుపై జర్నలిస్టులు మండిపడుతున్నారు.
For More News..