
హైదరాబాద్: హనుమాన్ జయంతి పురస్కరించుకుని శనివారం (ఏప్రిల్ 12) హైదరాబాద్‌లో భారీ శోభాయాత్ర జరగనుంది. అట్టహాసంగా జరగనున్న హనుమాన్ శోభయాత్రకి ఇప్పటికే భాగ్యనగరం సిద్ధమైంది. హనుమాన్ శోభాయాత్రలో పెద్ద ఎత్తున హిందువులు పాల్గొనే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
17,000 మంది నగర పోలీసులు, 3000 మంది ఆర్మీ రిజర్వుడ్ పోలీసులు, ఎనిమిది వందల మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. గౌలిగూడలో మొదలు కానున్న హనుమాన్ శోభాయాత్ర తాడ్ బండ్లో పూర్తవనుంది. గౌలిగూడ రామ్ మందిర్‌లో ఉదయం 8:30 కి హోమం పూర్తి అయినా తర్వాత 10 గంటలకు శోభాయాత్ర మొదలు కానుంది.
హనుమాన్ శోభాయాత్ర విగ్రహాలు ట్విన్ సిటీలోని 64 ప్రాంతాల నుంచి గౌలిగూడకి చేరుకోనున్నాయి. మొత్తం 3000 మంది బజరంగ్దళ్ కార్యకర్తలు సురక్ష టీమ్స్‌తో వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. రాత్రి 8 గంటలకు తాడ్ బండ్ దేవాలయంలో పూర్ణాహుతితో శోభాయాత్ర కార్యక్రమం ముగుస్తోంది.