హైదరాబాద్, వెలుగు: ఐటీ రంగంలోనే కాదు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) సంస్థలను కూడా హైదరాబాద్ ఆకర్షిస్తోంది. పెద్దపెద్ద కంపెనీలు ఇక్కడ తమ ఆఫీసులను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. సిటీలో భారీ వ్యాపార అవకాశాలు, బలమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్, వ్యాపార అనుకూల పరిస్థితులు, స్థిరమైన రాజకీయ వాతావరణం ఉండటమే ఇందుకు కారణం.
సిగ్నా హెల్త్‌కేర్, లాయిడ్స్బ్యాంక్, స్విస్‌రే, మెట్‌లైఫ్, డీటీసీసీ అమెరిప్రైస్వంటి కంపెనీలను ఈ నగరాన్ని తమ అడ్డాగా మార్చుకున్నాయి. బీఎఫ్ఎస్ఐ సంస్థలు ఇక్కడ ఆస్తులను పెద్ద ఎత్తున లీజుకు తీసుకుంటున్నాయి. ఈ ఏడాది మొదటి ఆర్నెళ్లలో బీఎఫ్ఎస్ఐ సెక్టార్ ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో టాప్–3లో ఉంది. లీజింగ్ మార్కెట్లో ఈ సెక్టార్‌కు 30శాతం మార్కెట్ వాటా ఉంది. బీఎఫ్ఎస్ఐ సెక్టార్‌లో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లకు కూడా హైదరాబాద్ఆకర్షణీయమైన నగరంగా ఎదిగింది. ఇక ముందు మరిన్ని కంపెనీలు సిటీకి వస్తాయని అంచనా.