గ్లోబల్‌‌‌‌‌‌‌‌ కేపబిలిటీ సెంటర్లకు కేరాఫ్ హైదరాబాద్

గ్లోబల్‌‌‌‌‌‌‌‌ కేపబిలిటీ సెంటర్లకు కేరాఫ్ హైదరాబాద్
  • ప్రస్తుతం సిటీలో 16.. 2030 నాటికి రెట్టింపు 
  • హైదరాబాద్​లో ఆఫీసుల ఏర్పాటుకు సంస్థల మొగ్గు 
  • ఇక్కడి జీసీసీల్లో పని చేసేందుకు యువత ఆసక్తి 
  • కెరీర్ నెట్ సంస్థ స్టడీలో వెల్లడి 

హైదరాబాద్​, వెలుగు: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) హైదరాబాద్ డెస్టినేషన్​గా మారుతున్నది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్​సర్వీసెస్, ఇన్సూరెన్స్​(బీఎఫ్ఎస్ఐ) రంగాలకు చెందిన జీసీసీలకు హైదరాబాద్ కేరాఫ్​గా నిలుస్తున్నది. 2030 నాటికి ఆయా రంగాల్లోని జీసీసీలు సిటీలో డబుల్ కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్​లో బీఎఫ్ఎస్ఐ జీసీసీలు 16 ఉండగా, 2030 నాటికి వాటి సంఖ్య 32కు పెరగనుంది. 

కెరీర్​ నెట్​అనే సంస్థ తాజాగా విడుదల చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. జీసీసీల్లో పనిచేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నదని స్టడీ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 లక్షల మంది జీసీసీల్లో పని చేస్తుండగా.. వారిలో 25 శాతం మంది హైదరాబాద్​లోనే ఉన్నారు. అంటే దాదాపు 5 లక్షల మంది దాకా వాటిలో అవకాశాలను పొందారు. ఈ 5 లక్షల మందిలో బీఎఫ్ఎస్ఐ రంగానికి చెందినవారే 8 శాతం మంది ఉంటారని స్టడీ అంచనా వేసింది. 

దేశంలోనూ డబుల్..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీఎఫ్ఎస్ఐ రంగాల్లో 120 జీసీసీలు ఉన్నాయి. ఇవి 2030 నాటికి 250కి పెరుగుతాయని కెరీర్​నెట్ స్టడీ వెల్లడించింది. ఇక ప్రస్తుతం ఉన్న బీఎఫ్ఎస్ఐ జీసీసీల్లో బెంగళూరులో అత్యధికంగా 42 ఉండగా, ఆ తర్వాత ఢిల్లీలో 22, హైదరాబాద్​లో 16 ఉన్నాయి.

 జీసీసీల విషయంలో హైదరాబాద్ మూడో స్థానంలో ఉన్నా.. ప్రస్తుతం చాలా కంపెనీలు హైదరాబాద్​లోనే ఆఫీస్ ఏర్పాటు​చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని స్టడీ తెలిపింది. ఎక్కువ మంది యువత హైదరాబాద్​జీసీసీల్లోనే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది. 

జీసీసీలపైనే ఫోకస్.. ​

అన్ని రంగాల్లో కలిపి ప్రస్తుతం దేశంలో 1,600 జీసీసీలు ఉన్నాయి. టీమ్​లీజ్ డిజిటల్ అనే సంస్థ రిపోర్ట్​ప్రకారం.. 2025 చివరి నాటికి దేశంలో జీసీసీల సంఖ్య 1,900కు పెరిగే అవకాశం ఉంది. ఆయా సంస్థలు ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకునేందుకే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టు ఆ సంస్థ నివేదిక తేల్చింది. 

ఫ్రెషర్​హైరింగ్​ 48 శాతం పెరిగే చాన్స్​ఉన్నట్టు వెల్లడించింది. వారికి ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఇంటర్న్​షిప్​ప్రోగ్రామ్​కింద ట్రైనింగ్​ ఇస్తారని తెలిపింది. టీసీఎస్​40 వేల మంది ఫ్రెషర్స్​ను, ఇన్ఫోసిస్​ 15,000 నుంచి 20,000 వరకు ఫ్రెషర్లను రిక్రూట్​చేసుకునే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

 హెచ్​సీఎల్, విప్రో వంటి సంస్థలూ జీసీసీల్లో రిక్రూట్​మెంట్​ను పెంచుకుంటాయని వెల్లడించింది. సగటు జీతం ఇంటర్న్​లకు రూ.5.5 లక్షల వరకు ఇవ్వొచ్చని తెలిపింది. ఇంటర్న్​షిప్​ అయ్యాక ఏడాదికి రూ.11 లక్షల వరకు వేతన ప్యాకేజీలను సంస్థలు అందించే చాన్స్​ఉంటుందని రిపోర్ట్​పేర్కొంది. ఐటీ ఇండస్ట్రీలో ఫ్రెషర్స్​కు ఇచ్చే వేతన ప్యాకేజీతో పోలిస్తే జీసీసీల్లో ఇచ్చే ప్యాకేజీ ఎక్కువని తెలిపింది. ఐటీ సెక్టార్​తో పోలిస్తే జీసీసీల్లో 30 శాతం వరకు ఎక్కువ జీతం ఇస్తారని వెల్లడించింది.