లోయర్ ​మిడిల్​ క్లాస్​కు హైదరాబాద్​ బెస్ట్​

లోయర్ ​మిడిల్​ క్లాస్​కు హైదరాబాద్​ బెస్ట్​
  •     వారు బతికేందుకు అనువైన సిటీగా నిలిచిన భాగ్యనగరం
  •     ‘ది గ్రేట్​ ఇండియన్​ వాలెట్​’ స్టడీలో వెల్లడి
  •     రూ.42 వేల నుంచి 44 వేలకు పెరిగిన ఇన్​కమ్​
  •     రూ. 19 వేల నుంచి రూ. 24 వేలకు పెరిగిన ఖర్చులు
  •     జాతీయ సగటుతో పోలిస్తే 33 % పెరిగిన సిటీ ఉద్యోగి ఆదాయం

హైదరాబాద్, వెలుగు: ఖర్చులు అమాంతం పెరిగిపోయి దేశమంతటా సామాన్యుడికి బతుకు భారమైతున్న ఈ రోజుల్లో.. హైదరాబాద్​మాత్రం లోయర్​ మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీస్​ జీవనానికి అత్యంత అనుకూలంగా ఉన్నట్టు తేలింది. పెరుగుతున్న ఖర్చులతో పాటే జీతాలు, ప్రజల సేవింగ్స్​ కూడా పెరుగుతున్నాయని వెల్లడైంది. దీంతో వరుసగా రెండో ఏడాది హైదరాబాద్​ సిటీ లోయర్​ మిడిల్​ క్లాస్​కు ఫ్రెండ్లీ సిటీగా నిలిచింది. 

హోమ్​ క్రెడిట్​ ఇండియా అనే సంస్థ చేసిన ‘ది గ్రేట్​ ఇండియన్​ వాలెట్​’ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్​ సహా 17 నగరాల్లో ప్రజల బతుకుదెరువు, ఖర్చులపై చేసిన స్టడీకి సంబంధించిన రిపోర్ట్​ను ఆ సంస్థ విడుదల చేసింది. వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉన్న సగటు ఉద్యోగుల నుంచి వివరాలను సేకరించింది. 

నిరుడితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం పెరిగిందని 52 శాతం మంది చెప్పారు. నిరుటితో పోలిస్తే హైదరాబాదీల సగటు నెల ఆదాయం రూ.42 వేల నుంచి రూ.44 వేలకు పెరిగినట్టు రిపోర్ట్​లో పేర్కొన్నారు. గతంతో పోలిస్తే సేవింగ్స్​పెరిగాయని సర్వేలో పాల్గొన్న 68 శాతం మంది రెస్పాండ్​ అయ్యారు. అయితే, సేవింగ్స్​తో పాటే ఖర్చులు కూడా పెరిగినట్టు చెబుతున్నారు. నిరుడు నెలకు సగటున రూ.19 వేలు ఖర్చయితే.. ఇప్పుడు రూ.24 వేలకు పెరిగినట్టు చెప్పారు. నెలవారీ ఇంటి సరుకులు, ఇంటి కిరాయికే ఖర్చు ఎక్కువైతున్నట్టు వాపోతున్నారు. 

జీతంలో సరుకులు, కిరాయిలకు 21 శాతం చొప్పున ఖర్చు పెడుతున్నట్టు చెప్పుకొచ్చారు. పిల్లల చదువులకు మరో 17 శాతం ఖర్చవుతున్నట్టు తెలిపారు. కాగా, ఆన్​లైన్​ ఫ్రాడ్స్​బారిన పడుతున్నట్టు సర్వేలో పాల్గొన్న 27 శాతం మంది చెప్పారు. యూపీఐ పేమెంట్ల మీద చార్జీలు వసూలు చేస్తే యూపీఐని అసలు వాడబోమని 82 శాతం మంది చెప్పడం గమనార్హం. 

మరోవైపు గత ఆరు నెలల్లో టూర్లు, షాపింగ్​లకు పెడుతున్న ఖర్చులు కూడా పెరిగినట్టు స్టడీ వెల్లడించింది. టూర్లకు పెడుతున్న ఖర్చు 35 శాతం, బయట తిండికి ఖర్చు 28 శాతం పెరిగినట్టు తేలింది. మొత్తంగా నివాసానికి, దిగువ మధ్య తరగతి జీవితాలకు హైదరాబాద్​ సిటీ అత్యంత అనువుగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. 

దేశంలో ఇదీ పరిస్థితి..

దేశంలో సగటున నెలకు మెట్రో సిటీల్లో రూ.35 వేలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో రూ.32 వేల దాకా ఖర్చవుతున్నట్టు స్టడీలో తేలింది. 2023తో పోలిస్తే ఇప్పుడు సగటున రూ.2 వేల వరకు ఖర్చులు పెరిగాయి. హైదరాబాద్​తో పాటు బెంగళూరు, పుణెల్లో ప్రజల జీతాలు దేశంలోనే గణనీయంగా పెరిగినట్టు స్టడీ తేల్చింది. దేశ సగటుతో పోలిస్తే హైదరాబాద్​లో 33 శాతం, బెంగళూరులో 15 శాతం అధికంగా జీతాల పెరుగుదల ఉన్నట్టు వెల్లడైంది. 

ఇక దేశంలో ఓ సగటు లోయర్​ మిడిల్​ క్లాస్​ వ్యక్తి జీతం రూ.33 వేలుగా ఉన్నట్టు తేలింది. అదే హైదరాబాద్​లో రూ.44 వేలుగా ఉండడం విశేషం. దేశంలో సగటున సరుకులకు 26 శాతం, కిరాయికి 21 శాతం మేర జీతంలో ఖర్చైపోతున్నాయి. ప్రయాణానికి 19 శాతం, పిల్లల చదువులకు 15 శాతం, మెడికల్​ బిల్లులకు 7 శాతం, కరెంట్​ బిల్లులకు 6 శాతం, గ్యాస్​కు 4 శాతం, ఫోన్​ బిల్లులకు 2 శాతం చొప్పున జీతం నుంచి ఖర్చు పెడుతున్నట్టు స్టడీ తేల్చింది. 

అమ్మాయిలే ఆధారం

దేశంలో ఉద్యోగం చేస్తున్న అమ్మాయిల సంఖ్య కూడా పెరిగినట్టు స్టడీలో తేలింది. వారి ఇండ్లలో ఆ అమ్మాయిల సంపాదనే ఆధారమని వెల్లడైంది. స్టడీలో పాల్గొన్న 42 శాతం మంది అమ్మాయిలు వారి కుటుంబాలను నెట్టుకొస్తున్నట్టు తేలడం విశేషం. మరోవైపు యూపీఐ వాడకం చెన్నై (90%)లో అత్యధికంగా ఉండగా.. అహ్మదాబాద్​ (58%)లో అత్యల్పంగా ఉన్నట్టు వెల్లడైంది. యూపీఐ మీద అప్పులు తీసుకునేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నట్టు అధ్యయనం తేల్చింది. 

లోన్​ అప్రూవల్​కు టైమ్​ తక్కువగా తీసుకోవడం, పేమెంట్లు ఈజీగా జరగడం, మంచి ఆఫర్లు రావడం, తక్కువ చార్జీలు ఉండడం వంటి కారణాలతో యూపీఐ క్రెడిట్​ వైపు ప్రజలు చూస్తున్నట్టు తేలింది. ప్రజల ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడంలో ఈ స్టడీ ఉపయోగపడుతుందని హోమ్​ క్రెడిట్​ఇండియా చీఫ్​ మార్కెటింగ్​ ఆఫీసర్ ​ఆశిష్​ తివారీ చెప్పారు. తాజాగా చేసిన స్టడీలో అర్బన్​, సెమీ అర్బన్​ ఏరియాల్లోని ప్రజల ఆర్థిక స్థితిగతులు చాలా ఇంప్రూవ్​ అయినట్టు తేలిందన్నారు. ఆయా సిటీల్లో ఆర్థిక వృద్ధి గణనీయంగా ఉండడమే అందుకు కారణమైందని వెల్లడించారు.