- ప్రపంచానికి ఇక్కడి నుంచే వ్యాక్సిన్లు..
- బయో ఏషియా సదస్సులో మంత్రి కేటీఆర్
- మన దగ్గర లైఫ్ సైన్సెస్ రంగంలో 14 వేల మందికి జాబ్స్ వచ్చినయ్
- జీనోమ్ వ్యాలీలో 450 మిలియన్ వ్యాక్సిన్ డోసుల కెపాసిటీతో అరబిందో ఫార్మా యూనిట్
- సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో 40 కంపెనీలు పనులు స్టార్ట్ చేశాయని వెల్లడి
- బీ -హబ్ ఏర్పాటుకు సైటివా సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ
- భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీలకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు హైదరాబాద్‌లో తయారైన వ్యాక్సిన్లనే వాడుతారని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో కేటీఆర్ బయో ఏషియా 2021 సదస్సును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కరోనా టైమ్‌లో రెమ్‌డెసివిర్, హైడ్రాక్సీ క్లోరోక్వీన్ తదితర మెడిసిన్ల కోసం ప్రపంచమంతా ఇండియా వైపు, హైదరాబాద్ వైపు చూసిందన్నారు. సుమారు 60 దేశాల ప్రతినిధులు, ప్రధాని మోడీ జీనోమ్ వ్యాలీని సందర్శించారని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్‌ను మంత్రి అభినందించారు. జీనోమ్ వ్యాలీలో ఏడాదికి 450 మిలియన్ వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన యూనిట్‌ను అరబిందో ఫార్మా నెలకొల్పుతోందని వెల్లడించారు. సాయి లైఫ్ సైన్సెస్ సంస్థ రూ. 4 వందల కోట్లతో జీనోమ్ వ్యాలీలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను విస్తరిస్తోందన్నారు.
.. వ్యాక్సిన్ క్యాపిటల్
హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీని వంద యూఎస్ బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యమని చెప్పారు. ఈ ఏడాది హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో రూ. 3,700 కోట్ల పెట్టుబడులు పెట్టారని, 14 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. జీనోమ్ వ్యాలీలో తయారైన అంబ్రాలసిబ్ (కేన్సర్ డ్రగ్)కు యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవల్ ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆ మందు తయారు చేసిన జీనోమ్ వ్యాలీలోని ఇంకోజెన్స్ సంస్థ ప్రతినిధులను అభినందించారు.
బి-హబ్ భాగస్వామ్యం
జీనోమ్ వ్యాలీలో బి–హబ్ (బయోఫార్మా స్కేల్ అప్ ఫెసిలిటీ) ఏర్పాటుకు సైటివా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, సంస్థ ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. బయో ఫార్మాస్యూటికల్ సెక్టార్‌లో అభివృద్ధి కోసం బి–హబ్ కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులో బయో ఫార్మాస్యూటికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్కులో 40 కంపెనీలు తమ కార్యకలాపాలను మొదలు పెట్టాయని మంత్రి చెప్పారు. త్వరలోనే ఈ పార్కు దేశంలోనే మెడికల్ డివైజెస్ ఉత్పత్తికి కేంద్రంగా మారుతుందన్నారు. మెడ్‌ట్రానిక్ అనే సంస్థ ఇక్కడ 170 మిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడి పెడుతోందని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి బయో ఏసియా సదస్సును వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు. ‘మూవ్ ది నీడిల్’ థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ రెండ్రోజుల సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి 30 వేల మంది లైఫ్, ఫార్మా, బయో సైన్సెస్ ఎక్స్పర్ట్స్ పాల్గొంటున్నారు. ఫార్మా రంగం అభివృద్ధి, ఆరోగ్య రంగంపై ఈ వర్చువల్ సదస్సులో చర్చలు జరగనున్నాయి.
65% వ్యాక్సిన్లు ఇక్కడే..
కొవాగ్జిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్ర ఎల్లాకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును కేటీఆర్ అందజేశారు. లైఫ్ సైన్సెస్‌లో అద్భుత కృషి చేసే వారికి ఏటా ఈ అవార్డును ఇస్తున్నారు. ఈ అవార్డు తన ఒక్కడిదే కాదని, వ్యాక్సిన్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఇందులో భాగస్వామ్యం ఉందని కృష్ణ ఎల్లా అన్నారు. భారత్ బయోటెక్ సిబ్బంది, సైంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచానికి కావాల్సిన వ్యాక్సిన్లలో సుమారు 65 % హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయన్నారు.
ఇవి కూడా చదవండి
పతంజలి కొరొనిల్ కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్న WHO
లాయర్ కారును వెంటాడి ఢీకొట్టిన లారీ.. 500 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది