హైదరాబాద్: పోలింగ్ సమయం దగ్గరపడుతుండటం.. వరుస సెలవుల కారణంగా పట్నం ఖాళీ అయ్యింది. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. నిన్నటి వరకు ఉన్న ట్రాఫిక్ రద్దీ ఇవాళ కనిపిచండంలేదు. ఏపీ, తెలంగాణలో సోమవారం ఎన్నికలు ఉండటంతో విజయవాడ, కర్నూల్ రూట్లలో రద్దీ పెరిగింది. గచ్చిబౌలీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రీల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజ్ వద్ద కూడా కార్లు, జీపులు, బస్సులు నిలిచిపోయాయి. రేపు సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ ఎలక్షన్ ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలపై ఉంటుంది. ఏపీలో కూడా ఓటు హక్కు ఉన్నవారు అక్కడికి వెళుతున్నందున జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది.
రైళ్లు ఫుల్.. కిక్కిరిసిన బస్టాండ్లు
ఎన్నికలు, వరుస సెలవుల నేపథ్యంలో ప్రజలు ఊళ్లకు తరలివెళ్తుండటంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ కు నిన్నటి నుంచే రద్దీ కొనసాగుతోంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో 20 ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే నడుపుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు ప్రైవేటు ట్రక్ ఆపరేటర్లు కూడా బస్ చార్జీలను అమాంతం పెంచేశారు. విజయవాడ రూట్ లో చార్జీ ఆకాశాన్నంటిందని తెలుస్తోంది. ఎంజీబీఎస్, జేబీఎస్ తోపాటు ఆరాంఘర్ చౌరస్తా, దిల్ సుఖ్ నగర్, సుచిత్ర సర్కిల్, బోయిన్ పల్లి, చింతల్, బాలానగర్ చౌరస్తా, మియాపూర్ బస్టాప్ లలోనూ రద్దీ నెలకొంది. పంజాగుట్ట, బేగంపేట, బంజారాహిల్స్, ఖైరతాబాద్, సోమాజిగూడ, కూకట్ పల్లి, నిజాంపేట, ప్రగతి నగర్, తదితర ప్రాంతాల్లో నామమాత్రంగా వాహనాలు తిరుగుతున్నాయి.