కరోనా డేంజర్లో హైదరాబాద్

కరోనాపై సర్కారు తీరుతో జనంలో తీవ్ర ఆందోళన: కిషన్ రెడ్డి
పాలించే పెద్దలు ఫాంహౌజ్ లోనే ఉంటే ప్రజలు ఎక్కడికి పోవాలె?

మజ్లిస్ చెప్పినట్టే సీఎం కేసీఆర్ నడుచుకుంటున్నరు
రాష్ట్ర సర్కారు కాపాడుతుందనే ఆశలు పొయినయ్

కల్వకుంట్ల, ఒవైసీ ఫ్యామిలీల నుంచి తెలంగాణను కాపాడుకోవాలని కామెంట్
13 వేల కోట్ల విలువైన భూములు స్వాహా చేసిన కేసీఆర్ ఫ్యామిలీ: బండి సంజయ్
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ‘జన సంవాద్ వర్చ్యువల్ ర్యాలీ’లో నేతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు పట్టింపులేని తీరుతో కరోనా వ్యాప్తి పెరిగిపోతోందని.. హైదరాబాద్ ఎప్పుడు కరోనాతో బ్లాస్ట్ అవుతుందో తెలియక జనంలో అయోమయం, ఆందోళన నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో పెద్దసంఖ్యలో కరోనా కేసులు వస్తున్నా సర్కారులో ఏమాత్రం చలనం లేదని మండిపడ్డారు. పాలించే పెద్దలే ఫాంహౌజ్ లో ఉంటే ఇక జనం ఎక్కడికి పోవాలని, వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. రెండు సెంట్రల్ టీంలు హైదరాబాద్ లో పరిస్థితిని పరిశీలించి, సూచనలు చేస్తే.. రాష్ట్ర సర్కారు పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. కరోనా నుంచి సర్కారు కాపాడుతుందనే ఆశలు పోయాయని.. ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జనం ఇండ్లనుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారుపై ఉందని చెప్పారు. శనివారం బీజేపీ హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ప్రాంతీయ జన్ సంవాద్ వర్చువల్ ర్యాలీ జరిగింది. పార్టీ స్టేట్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన డిజిటల్ వేదికపై నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, నేతలు ఇంద్రసేనారెడ్డి, కె.లక్ష్మణ్, రాంచందర్ రావు, పేరాల శేఖర్ రావు, చాడ సురేష్ రెడ్డి, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రెండు జిల్లా నేతలు, కేడర్, బీజేపీ అభిమానులు, జనం పెద్దసంఖ్యలో ఆన్లైన్ ద్వారా ఈ వర్చువల్ ర్యాలీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా లోపాలు ఉండటం వల్లే కరోనాను కట్టడి చేయలేకపోతున్నారని.. ఆఫీసర్లు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా ప్రగతి భవన్లో నిర్ణయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, కానీ టీఆర్ఎస్ సర్కారు ఒంటెద్దు పోకడలతో కరోనాను కంట్రోల్ చెయ్యలేకపోయిందని చెప్పారు. రాష్ట్రానికి రెండున్నర లక్షల పీపీఈ కిట్లను, ఆరున్నర లక్షల మాస్కులు, 22 లక్షల టాబ్లెట్లను ఇచ్చిందని వివరించారు. కేంద్రం ఇంత చేసినా టీఆర్ఎస్ సర్కారు నిందలు వేస్తోందన్నారు. ఒక ల్యాబ్ లో టెస్టులు చేస్తే 71 శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, మరి ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు.

ఫార్మాసిటీ పేరుతో భూములు స్వాహా: బండి సంజయ్
రాష్ట్రంలో రూ. 13 వేల కోట్ల విలువైన భూములను కేసీఆర్ ఫ్యామిలీ స్వాహా చేసిందని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ పేరుతో పేదల భూములను కేసీఆర్ ఫ్యామిలీ లాక్కుందని.. ఇప్పుడా భూముల విలువ పెంచుకునేందుకు ఫార్మా కంపెనీలంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. హెచ్ఎండీఏలో చేతులు తడిపిన వాళ్లకు మాత్రమే పర్మిషన్లు ఇస్తున్నారని.. సర్కారు తీరుతో రాష్ట్రంలో 7,200 కంపెనీలు మూతపడ్డాయన్నారు . టీఆర్ఎస్ ఎంఐఎంకు కొమ్ముకాస్తోందని.. రంజాన్ టైంలో కేసీఆర్ సర్కారు లాక్ డౌన్ సరిగా అమలు చేయకపోవడం వల్లే కరోనా కేసులు పెరిగాయని సంజయ్ ఆరోపించారు. సర్కారు నిర్లక్ష్యంతోనే జర్నలిస్టు మనోజ్, శ్రీకాంత్ చనిపోయారని, మధుసూదన్ మృతదేహాన్ని మాయం చేశారని.. ఇది మానవత్వం లేని సర్కారు అని మండిపడ్డారు. మర్కజ్ కు పోయొచ్చిన వాళ్లకు బిర్యానీ, కాజు, బాదం పెట్టారని.. తమ వాళ్లకు మాత్రం సరైన ట్రీట్ మెంట్ కూడా ఇవ్వకుండా శవాలను అప్పగించారని ఆరోపించారు. రాష్ట్రంలో పేదలకు ట్రీట్మెంట్ అందించకుండా వారి చావుకు కారణమవుతున్నారని.. ఆయుష్మాన్ భారత్ ను అమలు చేసి, కరోనానుంచి పేదల ప్రాణాలను కాపాడాలని సీఎం కేసీఆర్ ను కోరారు. హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లలా మారుస్తామని, మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్, ఆయన ఫ్యామిలీని ఆ నీళ్లలో ముంచి మంచినీళ్లా, మురికి నీళ్లా అడగాలని కామెంట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు వస్తుండటంతోనే మళ్లీ కేసీఆర్, కేటీఆర్ కథలు చెప్పేందుకు రెడీ అవుతున్నారని విమర్శించారు.

ఆ కుటుంబాల చేతుల్లో రాష్ట్రం బందీ
తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం, ఓవైసీ కుటుంబం చేతిలో బందీ అయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు కుటుంబాల పాలన పోవాలని, అందుకోసం బీజేపీ కేడర్, జనం సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ది కేవలం కోతల, మాటల సర్కారేనని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానం చేసిన అమరుల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని.. పైగా బంగారు తెలంగాణ అంటూ జనాన్ని మభ్యపెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని, అది మోడీ ఘనతేనని చెప్పారు. 70 ఏండ్లుగా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ జమ్మూకాశ్మీరీల హక్కులను కాలరాసిందని.. కశ్మీర్ సమస్యకు మోడీ శాశ్వత పరిష్కారం చూపారని తెలిపారు.

For More News..

ప్రైవేటు ల్యాబుల్లో తప్పుడు రిజల్ట్స్

హైదరాబాద్ విడిచి సొంతూళ్లకు బాట

మావల్లే మీ భర్త చనిపోయాడు.. మమ్మల్ని క్షమించు!