హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఒక్కటే కాదు : కిషన్ రెడ్డి

హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఒక్కటే కాదు : కిషన్ రెడ్డి

నిధుల్లేక పనులు జరగట్లే

పద్మారావునగర్/సికింద్రాబాద్, వెలుగు: హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఒక్కటే కాదని, పాతబస్తీ, ముషీరాబాద్, అంబర్​పేట వంటి ప్రాంతాల్లోని బస్తీలు కూడా ఇందులో భాగమేననని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి చెప్పారు. హైటెక్ సిటీని మాత్రమే అభివృద్ధి చేసి వేలాది బస్తీలను విస్మరించడం కరెక్ట్​కాదన్నారు. రాష్ట్ర ఆదాయంలో 80 శాతం ఇక్కడి నుంచే వస్తుందని, కానీ నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచిపోవడం బాధాకరం అన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టర్లు ధర్నాలు చేసే పరిస్థితికి తీసుకురావడం దౌర్భాగ్యం అని విమర్శించారు. మంగళవారం బన్సీలాల్​పేట డివిజన్​లో మాజీ మంత్రి మర్రి శశిధర్​రెడ్డితో కలసి కిషన్​రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. మొదట డా.బీఆర్.అంబేద్కర్​వర్ధంతి సందర్భంగా హమాలీబస్తీలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పద్మారావునగర్ కామకోటి ఆడిటోరియంలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, రెవెన్యూ, వైద్య, విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్పొరేటర్లు, లోకల్​లీడర్లు కిషన్​రెడ్డి దృష్టికి తెచ్చిన బస్తీల్లోని సమస్యల  ను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

అనంతరం హమాలీబస్తీ, వెంకటాపురం కాలనీ, జయప్రకాశ్ నగర్, బోయిగూడ, మేకలమండి, భోలక్​పూర్, రామస్వామి కాంపౌండ్, సీసీ నగర్​లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడుతూ..అన్ని శాఖల్లో సమర్థమైన అధికారులు, సిబ్బంది ఉన్నా నిధులు లేక పనులు ముందుకు సాగడం లేదన్నారు. 9 ఏండ్లుగా డబుల్​బెడ్రూం ​ఇండ్లు రాక ఎంతో మంది నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర జనాభాలో 30 శాతం హైదరాబాద్​లోనే ఉన్నారని, మౌలిక వసతులు కల్పించడంలో కేసీఆర్​ప్రభుత్వం విఫలమైందన్నారు. కిషన్​రెడ్డి వెంట మర్రి పురూరవరెడ్డి, మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యాంసుందర్, కార్పొరేటర్లు ఉన్నారు.