టీఎస్ గ్రూప్స్ ప్రత్యేకం : జాగీర్దార్లు అంటే ఎవరు ?

టీఎస్ గ్రూప్స్ ప్రత్యేకం : జాగీర్దార్లు అంటే ఎవరు ?

భూమి యాజమాన్యంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం,  భూ యాజమాన్యంలో అసమానతలు తొలగించి సామాజిక న్యాయం, వ్యవసాయ  సాధికారత పెంచటమే భూ సంస్కరణలు. వ్యవసాయ పారిశ్రామిక రంగాల అభివృద్ధి, ఉత్పత్తుల పెంపు, వ్యవసాయ, స్వయం సమృద్ధికి చేసే కార్యక్రమాల్లో భూ సంస్కరణలు కీలకమైనవి. తెలంగాణలోని జాగీర్దార్లు, సంస్థానాదీశులు, ఇనాందార్లు, మధ్యవర్తులు, అధిక శిస్తు వసూలు ద్వారా రైతును దోపిడీ చేసే విధానాన్ని నిరోధించడానికి పలు సంస్కరణలు చేశారు. 

1948 ఫిబ్రవరిలో జె.సి.కుమారప్ప అధ్యక్షతన వ్యవసాయ సంస్కరణల కమిటీ ఏర్పాటు చేశారు. ఇది తన రిపోర్టును 1949 జులైలో అందజేసింది. ఈ కమిటీ దేశంలో భూ సంస్కరణల అమలుకు మూడు రకాల సూచనలు చేసింది. అవి.. మధ్యవర్తుల తొలగింపు, కౌలు సంస్కరణలు, భూగరిష్ఠ పరిమితి చట్టం. 1950 దశాబ్దాన్ని భూ సంస్కరణల దశాబ్దంగా పిలుస్తారు. రాష్ట్రంలో భూసంస్కరణలను రెండు దశలుగా వర్గీకరించవచ్చు. 
మొదటి దశ: 1948 నుంచి 1970 వరకు. 
రెండో దశ: 1970 నుంచి 1980 వరకు. మొదటి దశ భూ సంస్కరణలు రావడానికి నాలుగంశాలు ప్రధాన పాత్ర పోషించాయి. అవి.. వ్యవస్థాపూర్వక అంశాలు, రాజకీయ అంశాలు, రైతాంగ ఉద్యమాలు, ఆర్థిక కారణాలు.  

హైదరాబాద్​ జాగీర్దార్ల రద్దు చట్టం - 1949 

ఈ చట్టానికి తెలంగాణ మధ్యవర్తుల తొలగింపు చట్టం, హైదరాబాద్​ సంస్థానం మధ్యవర్తుల తొలగింపు చట్టం అనే పేర్లూ ఉన్నాయి. భూస్వామ్య వ్యవస్థ వల్ల రైతులు, కౌలుదార్లు, వ్యవసాయ కూలీలు అభద్రతా భావంతో బతికేవారు. వారి దయనీయ పరిస్థితిని అధ్యయనం చేయడానికి హైదరాబాద్​ వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సూచనల మేరకు 1949 ఆగస్టు 15న హైదరాబాద్​ జాగీర్దార్ల రద్దు క్రమబద్దీకరణ 1358 ఫసలీ చట్టాన్ని ఆమోదించారు. ఈ కమిటీ జాగీర్దార్ల వ్యవస్థను రద్దు చేయాలని, కౌలుదార్లకు రక్షణ కల్పించాలని పేర్కొంది. దీని ప్రకారం మొదట జాగీరు భూములను తర్వాత సర్ఫేఖాస్​ భూములను దివాని (రైత్వారీ) భూములుగా ప్రకటించారు. 

చట్టం అమలు: 1949 సెప్టెంబర్​ 1న హైదరాబాద్​ జాగీర్దార్లు రద్దు చట్టం అమలు పర్చడం కోసం జాగీర్​ పరిపాలనాధికారిని నియమించారు. నియమ నిబంధనల కోసం 1949 సెప్టెంబర్​ 14న మరొక హైదరాబాద్​ జాగీర్​ రద్దు నిబంధనల చట్టాన్ని రూపొందించారు. మొదట 1949 అక్టోబర్​ నుంచి 1950 మార్చి వరకు తొలగించిన జాగీర్దార్లకు తాత్కాలిక అలవెన్సులు ఇచ్చారు. 1950 జనవరి 25న నష్టపరిహారాన్ని నిర్ణయించే నిబంధనతో హైదరాబాద్​ జాగీర్ల (కమ్యూటేషన్​) రెగ్యులేషన్​ చట్టం, 1950 అక్టోబర్​ 18న మరొక సవరణను ప్రకటించారు. 

చట్టంలోని అంశాలు: ఈ చట్టం ప్రకారం 1950 ఏప్రిల్​ నుంచి జాగీర్దారుల గత 10 సంవత్సరాల ఆదాయాన్ని ప్రమాణంగా ఎంచుకొని మొత్తంగా రూ.18కోట్లు నష్టపరిహారంగా దశల వారీగా చెల్లించారు. 1990 జులై వరకు రూ.29.37కోట్లు చెల్లించారు. 7,866 గ్రామాల్లోని ఫ్యూడల్​ దోపిడీకి చిహ్నాలైన 975 జాగీర్దార్లను తొలగించి వ్యవసాయం చేసే రైతులను యాజమాన్యం హక్కులు కల్పించారు. జాగీర్దారీ భూ ముల శిస్తులో 12.6శాతం రాయితీ ఇచ్చారు. హైదరాబాద్​ సేద్య విస్తీర్ణంలో ఇది 30.9శాతంగా ఉండేది. సైనిక చర్య అనంతరం తెలంగాణ ప్రజలు సాధించిన తొలి విజయంగా ఈ చట్టాన్ని పేర్కొనవచ్చు. 

ఇనాందార్లు : ఇనాం అంటే బహుమానం లేదా దానం అని అర్థం. కొన్ని ప్రత్యేక విధులు నిర్వర్తించినందుకు, సామాజిక సేవ చేసినవారికి, పల్లకీలు మోసిన వారికి ప్రభుత్వం కొన్ని భూములపై శిస్తు వసూలు చేసుకునే హక్కును పాక్షికంగా/ పూర్తిగా ఇచ్చారు. అలాంటి వారిని ఇనాందార్లు అంటారు. హిందూ ముస్లిం పాలకులు సేవకుల నుంచి సేవలను పొందిన దానికి లేదా భవిష్యత్తులో పొందే వాటికి కలిపి ఇచ్చారు. 

జాగీర్దార్లు :  రాజుకు లేదా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సేవ చేసిన వారికి లేదా వారి హక్కులు గౌరవించడానికి ప్రభుత్వం కొన్ని గ్రామాలను దానంగా ఇచ్చేది. జాగీర్​ అనే పదం రెండు పర్షియన్​ పదాల కలయిక. జాగీర్​ అంటే కలిగి ఉండటం, దార్​ అంటే అధికారి. జాగీర్ధారి విధానాన్ని ఢిల్లీ సుల్తానులు ప్రవేశపెట్టారు. మొత్తం భూభాగంలో 40శాతం భూమిని జారీర్దార్లకు కొన్ని షరతులు లేకుండా ఇచ్చారు. ఈ విధంగా ఉచితంగా ఇచ్చే/ దానంగా ఇచ్చే గ్రామాలను జాగీర్​లు అంటారు. ఆ గ్రామాలు పొందిన వారిని జాగీర్ధార్లు అంటారు. వీరి ప్రభావం 6560 గ్రామాల్లో 40,000 చదరపు మైళ్ల విస్తీర్ణం వరకు ఉండేది. జాగీర్ధార్ల సంఖ్య 1922లో 1170 ఉండగా 1949 నాటికి 1500కు పెరిగింది. 

సంస్థానాలు :  నిజాం సొంత ఖర్చు కోసం నిర్దేశించిన భూమిని సర్ఫేకాస్​ అంటారు. ఈ భూమిలో రైతులు నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తారు. ఈ ఆదాయం నిజాం సొంత ఖర్చులకు వినియోగిస్తారు. ఇది సుమారు 6562 చదరపు మైళ్ల విస్తీర్ణంతో 1347 గ్రామాలు కలిగి ఉండేవి. 

సంస్థానాలు : హైదరాబాద్​ ప్రాంతంలో మొదటి నుంచి అనేక చిన్న చిన్న ప్రాంతాలకు హిందూ రాజులు అధిపతులుగా ఉండేవారు. ఈ సంస్థానాధిపతినే దివానీ అని పిలుస్తారు. వీరు తమ ఆధీనంలోగల భూములపై శిస్తు వసూలు చేసి నిజాం రాజుకు పేష్కస్​ రూపంలో చెల్లించేవారు. తద్వారా ఆ గ్రామాలపై భూములపై యాజమాన్య, పాలనా హక్కులు పొందేవారు. హైదరాబాద్​ సంస్థానంలో 497 గ్రామాలు 503 0 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండేవి. హైదరాబాద్​ రాష్ట్రంలో 15 సంస్థానాలు ఉండేవి. వీటిలో ప్రధానమైనవి గద్వాల, వనపర్తి, జట్టిప్రోలు, అమరచింత, పాల్వంచ.

ఖాల్సా : ఈ పద్ధతిని 1875లో సాలార్​జంగ్​ ప్రవేశపెట్టారు. ప్రభుత్వ యంత్రాంగమే శిస్తును వసూలు చేస్తూ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన కింద ఉండే భూములను దివానీ భూములని అంటారు. హైదరాబాద్​ రాష్ట్రంలో 60శాతం వ్యవసాయ భూమి నిజాం ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉండేది. ఇందులో మూడంచెల దళారీ వ్యవస్థ ఉండేది. వీరు శిస్తు వసూలు చేసే అధికారాన్ని మధ్యవర్తులకు వేలం పాట ద్వారా అప్పగించేవారు. ఈ మధ్యవర్తులను దేశ్​ముఖ్, సర్​ దేశ్​ముఖ్​, దేశాయులు, సర్​ దేశాయి, పండిత్​, కరణం అనే పేర్లతో వ్యవహరించే వారు. ఈ పద్ధతిలో భూస్వాముల కింద ఉన్న భూమికి నిజాం రాజ్యంలో హైదరాబాద్​ రెవెన్యూ కోడ్​ కింద బొంబాయి చట్టం 1879 ద్వారా చట్టబద్ధత కల్పించారు.

తెలంగాణ ఇనాంల రద్దు చట్టం - 1955

సమాజ సేవ చేసే వారికి, కొన్ని ప్రత్యేక విధులు నిర్వహించిన వారికి, పల్లకీలు మోసే వారికి ఉద్యోగులకు గతంలో రాజులు ఉచితంగా ఇచ్చిన భూములను ఇనాంలు అంటారు. 1955లో తెలంగాణలో ఇనాందారీ విధానాన్ని రద్దు చేసే చట్టం ఆమోదం పొందింది. ఈ చట్టం దేవాదాయ, ధర్మాదాయ, ఇనాం భూములకు వర్తించేది కాదు. 1967లో అన్ని రకాల ఇనాంల రద్దుకు సమగ్రమైన చట్టం చేశారు. ఈ చట్టం 1968 ఆగస్టు 15 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇనాందార్లు కోర్టుకు వెళ్లడంతో న్యాయబద్దమైన నష్టపరిహారం లేని కారణంగా 1970 ఏప్రిల్​ 3న ఈ చట్టాన్ని హైకోర్టు కొట్టి వేసింది. 1973 నవంబర్​ 1న ప్రభుత్వం ఇనాంల రద్దు చట్టాన్ని సవరించి పునరుద్ధరించింది. 

ఇనాంల రద్దు (సవరణ చట్టం - 1985) 

1955 చట్టంలోని మినహాయింపులను రద్దు చేయడానికి 1985లో మరో సవరణ తీసుకువచ్చి మతపరమైన, చారిటిబుల్​ ఇనాంలన్నింటిని రద్దు చేశారు. ఈ చట్టాన్ని అమలుపర్చడానికి 1988 డిసెంబర్ 20న జారీ అయిన రూల్స్​ ప్రకారం ఇనాం భూములపై యాజమాన్య హక్కులున్న వారు, సేద్యం చేస్తున్నవారు, కౌలుదారులు తొమ్మిది నెలలుగా అంటే 1989 సెప్టెంబర్​ 22లోగా రిజిస్ట్రేషన్​ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు. వీటిని ఆధారంగా చేసుకొని ఆర్ఢీవో విచారణ జరిపి రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్స్​ ఇచ్చారు.

ఒకవేళ ఆర్​డీవో తీర్పు ఆమోదయోగ్యం కాకపోతే జిల్లా కలెక్టర్​కు అప్పీల్​ చేసుకోవచ్చు. కలెక్టర్​ తీర్పు తుది తీర్పుగా పరిగణించాల్సి ఉంటుంది. తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో 3,94,623 ఎకరాలకు సంబంధించి 81,522 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 46,526 మంది (57శాతం) రైతులకు రిజిస్ట్రేషన్​ పత్రాలు ఇచ్చారు. వీరి ఆధ్వర్యంలో 3,04,100 ఎకరాల భూమి ఉంది. సెటిల్​ కాని కేసులు 34,924 ఉండగా కోర్టు లిటిగేషన్​లో 72 కేసులు ఉన్నాయి.