- లోక్‌సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్ హైవే 765లోని హైదరాబాద్– కల్వకుర్తి మార్గాన్ని నాలుగు లేన్లుగా విస్తరించే ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)పై పరిశీలన పనులు ప్రారంభించినట్లు స్పష్టం చేసింది. లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
దేశంలోని హైవేల అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. ఇందులో భాగంగా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలను సేకరిస్తున్నామని చెప్పారు. తెలంగాణ నుంచి కూడా రాష్ట్ర పరిధిలోని పలు నేషనల్ హైవేల డిక్లరేషన్/అప్‌గ్రేడేషన్/డెవలప్‌మెంట్‌కు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాలు పంపే డీపీఆర్, రహదారుల కనెక్టివిటి కూడా అవసరమని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నిధులతో పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.