- రైల్వే ఓవర్ బ్రిడ్జిను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
గచ్చిబౌలి: కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.86 కోట్లతో చేపట్టిన ఈ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే హైటెక్ సిటీ నుంచి కూకట్ పల్లి వరకు, అలాగే జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి. సనత్ నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కి.మీ ప్రయాణ దూరం తగ్గుతుందని అధికారులు తెలిపారు.ఫ్లై ఓవర్ ను ప్రారంభోత్సవం చేస్తున్న కారణంగా ఇయ్యాల ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.
ముందస్తు అరెస్టులు
కూకట్ పల్లి ఆర్వోబిని ప్రారంభించడానికి వస్తున్న రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ను అడ్డుకుంటారనే అనుమానంతో కూకట్ పల్లి పరిసర ప్రాంతాల కాంగ్రెస్ నాయకులను తెల్లవారుజామున 3.30 గంటల నుండే కేపీహెచ్ బీ పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఆర్వోబి ప్రారంభోత్సవ కార్యక్రమం సాఫీగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలన్న ఆదేశాల మేరకు అరెస్టులు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ మళ్లింపు
ఖైతలాపూర్ ఆర్వోబీని ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా ఇవాళ ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ను దారిమళ్లిస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపును గుర్తించాలని పోలీసులు కోరుతున్నారు. ట్రాఫిక్ ఆంక్షల వివరాలు...
1. ఎర్రగడ్డ నుండి హైటెక్ సిటీ వయా మూసాపేట వెళ్ళే వాహనాలు ముసాపేట, వై జంక్షన్, కూకట్‌పల్లి, రోడ్ నం.1, కె.పి.హెచ్.బి, జె.ఎన్.టి.యు మీదుగా మళ్లింపు...
2. బాలానగర్, వై జంక్షన్ నుంచి హైటెక్ సిటీ వయా ఐ.డి.ఎల్ ట్యాంక్ మీదుగా వెళ్ళే వాహనాలు కూకట్‌పల్లి, రోడ్ నం.1, కె.పి.హెచ్.బి, జె.ఎన్.టి.యు మీదుగా మళ్లింపు...
3. హఫీజ్ పేట నుండి ఖైత్లాపూర్ వెళ్ళే వాహనాలు ఆర్.యు.బి, జె.ఎన్.టి.యు నుండి మళ్లింపు..