ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీబీపీ మధ్యే పోటీ : విశ్వేశ్వర్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీబీపీ మధ్యే పోటీ : విశ్వేశ్వర్ రెడ్డి
  • బీబీపీ అంటే మజ్లిస్,కాంగ్రెస్, బీఆర్ఎస్: విశ్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్  లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ, బీబీపీ మధ్య జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. బీబీపీ అంటే భాయ్ పార్టీ (మజ్లిస్), బాప్–బేటే కే పార్టీ(బీఆర్‌‌ఎస్​), బాప్–బేటీకి పార్టీ (కాంగ్రెస్​) అంటూ ఎద్దేవా చేశారు. ఆదివారం బీజేపీ స్టేట్  ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పాల్గొనని పార్టీలకు అంబేద్కర్ పేరును వాడుకునే హక్కు ఉందా అని ప్రశ్నించారు.

 అంబేద్కర్  విధానాల గురించి ఆ మూడు పార్టీలకు మాట్లాడే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం చూస్తుంటే ఆ పార్టీలు ఎంఐఎంకు లొంగిపోయాయా అని అనుమానం వ్యక్తం చేశారు. అసదుద్దీన్.. ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారని, ఆయనకు కూడా కేసీఆర్ బూతుల రోగం అంటుకుందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్  కార్పొరేటర్లు ఆత్మ పరిశీలన చేసుకుని హైదరాబాద్  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని ఆయన కోరారు.