
చిరుతలు అడవులు వదిలి..జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహారం వెతుక్కుంటూ కాలనీల మీదపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో చిరుతపులి కలకలం సృష్టించింది. ఎల్బీనగర్ పరిధిలో చిరుత పులి సంచారం భయాందోళన రెకెత్తిస్తోంది. తమ కాలనీల్లోకి చిరుత వచ్చిందన్న వార్తలతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఏ క్షణంలో ఎవరిపై దాడి చేస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
వనస్థలిపురంలోని సాగర్ కాంప్లెక్స్, రోడ్ నెంబర్ 6లో చివరన ఓ ఇంటిపై చిరుత పులి నిద్రించినట్లు స్థానికులు గుర్తించారు. ఆగస్టు24వ తేదీ అర్థరాత్రి 12.30 గంటలకు ఇంటిపై చిరుత పులి సంచరిస్తున్నట్లు ఇంటి యజమాని అఖిల్ తెలిపాడు. వెంటనే అప్రమత్తమై 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే పోలీసులు వచ్చేలోపు చిరుతపులి.. ఎరోనాటికల్ సంస్థకు ఆనుకొని ఉన్న గోడ నుండి అడవిలోకి వెళ్లినట్లు అఖిల్ తెలిపాడు. అఖిల్ ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.. చిరుత అడుగుల అనవాళ్లను పరిశీలిస్తున్నారు.
అయితే ఇబ్రహీంపట్నం వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. సాధారణంగా చిరుత 24 గంటల్లో సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రయాణించగలదు. ఈ క్రమంలో చిరుత ఇబ్రహీంపట్నం అడవి వరకు వెళ్లే ఛాన్స్ ఉందని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇబ్రహీంపట్నం అటవీ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. అంతేకాకుండా చిరుత కదలికలను గుర్తించేందుకు పలు చోట్ల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే బోన్లను కూడా సిద్ధంగా ఉంచినట్లు స్థానిక అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం పరిధిలో చిరుతపులి సంచారం చేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. చిరుత ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందో అని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు, వాహనదారులకు అటవీ శాఖ అధికారులు సూచనలు చేశారు. రాత్రి సమయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.