
ముంబై: సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ కథనే రిపీట్ చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత గత పోరులో 246 టార్గెట్ ఛేజ్ చేసి ఔరా అనిపించిన రైజర్స్ ఈ సారి బ్యాటింగ్‌లో తడబడి ఐదో ఓటమి ఎదుర్కొంది. వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ముంబై చేతిలో పరాజయం పాలైంది. విల్ జాక్స్ (2/14; 26 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36) ఆల్‌రౌండ్ షోతో ముంబై మూడో విక్టరీ అందుకుంది.
తొలుత సన్ రైజర్స్ 20 ఓవర్లలో 162/5 స్కోరు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ( 28 బాల్స్‌లో 7 ఫోర్లతో 40), హెన్రిచ్ క్లాసెన్ (28 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) రాణించారు. విల్ జాక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ముంబై 18.1 ఓవర్లలోనే 166/6 స్కోరు చేసి గెలిచింది. జాక్స్‌కు తోడు ర్యాన్ రికెల్టన్ (23 బాల్స్‌లో 5 ఫోర్లతో 31) కూడా రాణించాడు. జాక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వచ్చే బుధవారం ఉప్పల్‌లో జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో ముంబైతోనే సన్ రైజర్స్ పోటీ పడనుంది.
జాక్స్ జోరు.. రాణించిన అభి, క్లాసెన్
గత మ్యాచ్‌లో భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసిన సన్ రైజర్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ముంబై సక్సెస్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన రైజర్స్ తన మార్కు వేగం చూపెట్టలేకపోయింది. ఆరంభంలో అభిషేక్, చివర్లో హెన్రిచ్ క్లాసెన్ పోరాటంతో ఆ మాత్రం స్కోరు చేసింది. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ బౌలర్లను ఉతికేసిన అభిషేక్, ట్రావిస్ హెడ్ (29 బాల్స్‌లో 3 ఫోర్లతో 28) వాంఖడేలో అదే జోరు కొనసాగించలేకపోయారు. బుమ్రా, దీపక్ చహర్ కట్టడి చేయడంతో హెడ్ బంతికో పరుగు మాత్రమే చేశాడు. చహర్ వేసిన ఐదో ఓవర్లో అభిషేక్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి అలరించాడు.
కానీ, తర్వాతి ఓవర్లో బుమ్రా మూడు రన్సే ఇవ్వడంతో పవర్ ప్లేను సన్ రైజర్స్ 46/0తో ముగించింది. హార్దిక్ వేసిన ఎనిమిదో ఓవర్లో ఫోర్ రాబట్టిన అభి తర్వాతి బాల్‌కే క్యాచ్ ఔటవ్వడంతో తొలి వికెట్‌కు 59 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ (2) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో క్రీజు దాటొచ్చి ఆడబోయి స్టంపౌటయ్యాడు. 12వ ఓవర్లో రెండే రన్స్ ఇచ్చిన జాక్స్ హెడ్‌ను కూడా ఔట్ చేయడంతో రైజర్స్ 83/3తో నిలిచింది. ఈ దశలో ముంబై బౌలర్లు డాట్ బాల్స్ వేస్తూ ఒత్తిడి పెంచడంతో హిట్టర్ క్లాసెన్, నితీశ్ రెడ్డి (21 బాల్స్‌లో 1 ఫోర్‌తో19) ఇబ్బంది పడ్డారు. 9 నుంచి 17 ఓవర్ల మధ్యలో రెండే బౌండ్రీలు రావడంతో రన్ రేట్ పడిపోయింది.
స్పీడు పెంచే ప్రయత్నంలో బౌల్ట్ బౌలింగ్‌లో నితీశ్.. తిలక్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో రైజర్స్ 150 రన్స్ చేయడం కష్టమే అనిపించింది. ఈ టైమ్‌లో క్లాసెన్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. దీపక్ చహర్ వేసిన 18వ ఓవర్లో వరుసగా 6, 4, 6, 6 కొట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు. తర్వాతి ఓవర్లో తొలి బాల్‌కే బుమ్రా అతడిని క్లీన్ బౌల్డ్ చేసి నాలుగే రన్స్ ఇచ్చాడు. హార్దిక్ వేసిన ఆఖరి ఓవర్లో అనికేత్ వర్మ (18 నాటౌట్) వరుసగా రెండు సిక్సర్లు కొట్టగా.. కెప్టెన్ కమిన్స్ (8 నాటౌట్) లాస్ట్ బాల్‌ను స్టాండ్స్‌కు పంపి స్కోరు 160 మార్కు దాటించాడు.
ముంబై అలవోకగా..
సాధారణ టార్గెట్ ఛేజింగ్‌ను ముంబై మెరుపు వేగంతో ఆరంభించింది. తొలి రెండు ఓవర్లలో షమీ, కమిన్స్ వరుసగా 4, 3 రన్సే ఇచ్చినా.. ఓపెనర్ రోహిత్ శర్మ (16 బాల్స్‌లో 3 సిక్సర్లతో 26) మూడో ఓవర్లో రెండు సిక్సర్లతో వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తుకు తెచ్చాడు. కమిన్స్ బౌలింగ్‌లోనూ మరో సిక్స్‌తో స్టేడియాన్ని హోరెత్తించిన రోహిత్.. మరో షాట్‌కు ట్రై చేసి హెడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. షమీ బౌలింగ్‌లో వన్‌డౌన్ బ్యాటర్ విల్ జాక్స్ ఇచ్చిన క్యాచ్‌ను హెడ్ డ్రాప్ చేయగా.. ఎషాన్ మలింగ బౌలింగ్‌లో రికెల్టన్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టడంతో పవర్ ప్లేను ముంబై 55/1తో ముగించింది.
జీషన్ అన్సారీ వేసిన తర్వాతి ఓవర్లో రికెల్టన్ కవర్స్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. కానీ, రికెల్టన్ ఈ బాల్‌ను ఆడే ముందే కీపర్ క్లాసెన్ గ్లోవ్స్ వికెట్లను దాటి ముందుకు రావడంతో అంపైర్ నో బాల్ ఇచ్చాడు. ఈ చాన్స్‌ను రికెల్టన్ పెద్దగా సద్వినియోగం చేసుకోలేదు. హర్షల్ పటేల్ వేసిన ఎనిమిదో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి వెంటనే హెడ్‌కు చిక్కి వెనుదిరిగాడు. అయితే, ఈ ఆనందం సన్ రైజర్స్‌కు ఎంతోసేపు నిలువలేదు. అప్పటికే క్రీజులో కుదురుకున్న జాక్స్‌కు సూర్యకుమార్ (15 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26) తోడయ్యాడు.
ఈ ఇద్దరూ స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగారు. జీషన్ బౌలింగ్‌లో జాక్స్ ఫోర్ కొడితే.. సూర్య స్వీప్ షాట్‌తో సిక్స్ రాబట్టి ఛేజింగ్‌కు మరింత జోష్ తెచ్చారు. పదో ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్ రాహుల్ చహర్‌కు జాక్స్ సిక్స్‌తో వెల్‌కం చెప్పాడు. జీషన్ తర్వాతి ఓవర్లో జాక్స్, సూర్య చెరో సిక్స్.. ఎషాన్ మలింగ బౌలింగ్‌లో చెరో ఫోర్ రాబట్టారు. ఈ టైమ్‌లో మళ్లీ బౌలింగ్‌కు దిగిన కెప్టెన్ కమిన్స్ తన వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ ఔట్ చేయడంతో రైజర్స్ రేసులోకి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ, ముంబై ఆ చాన్స్ ఇవ్వలేదు. తిలక్ వర్మ (21నాటౌట్) తోడుగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా (21) భారీ షాట్లు కొట్టాడు. కమిన్స్ బౌలింగ్‌లోనే రెండు ఫోర్లు, హర్షల్ ఓవర్లో 6, 4 బాది ముంబై విజయం ఖాయం చేశాడు. స్కోరు సమం అయిన తర్వాత ఎషాన్ బౌలింగ్‌లో పాండ్యా, నమన్ ధీర్ (0) ఔటైనా.. జీషన్ ఓవర్లో తిలక్ విన్నింగ్ ఫోర్ కొట్టాడు.
సంక్షిప్త స్కోర్లు
సన్ రైజర్స్: 20 ఓవర్లలో 162/5 (అభిషేక్ 40, క్లాసెన్ 37, జాక్స్ 2/14)
ముంబై: 18.1 ఓవర్లలో 166/6 (జాక్స్ 37, రికెల్టన్ 31, కమిన్స్ 3/26).