
బషీర్‌బాగ్, వెలుగు: తల్లి అంత్యక్రియల కోసం కారు మాట్లాడుకుని వెళ్లిన వ్యక్తి.. డ్రైవర్‌కు డబ్బులు ఇవ్వబోయి పొరపాటున టోల్గేట్దగ్గర ఫాస్టాగ్క్యూఆర్కోడ్కు పంపాడు. ఆ డబ్బులు వాపస్తెచ్చుకోవడానికి సదరు కంపెనీ నిర్వాహకులతో మాట్లాడాలని గూగుల్‌లో సెర్చ్చేశాడు. అందులో కనిపించిన నంబర్‌కు కాల్చేసి స్కామర్ల చేతికి చిక్కాడు. దశలవారీగా సుమారు రూ.2 లక్షలకు పైగా డబ్బు పోగొట్టుకున్నాడు. నగరానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తి తల్లి కర్ణాటకలో చనిపోయింది. అంత్యక్రియలకు వెళ్లేందుకు రూ.11 వేలకు క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరాడు. ఓ టోల్గేట్దగ్గర డ్రైవర్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్చేయబోయి పొరపాటున టోల్ గేట్ క్యూఆర్ కోడ్ కు పంపించాడు.
వెంటనే అతని కెనరా బ్యాంక్ బ్రాంచ్ కు ఫోన్ చేసి చెప్పగా, ప్రాసెస్ చేస్తున్నామని, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ)కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎన్పీసీఐ నంబర్కోసం గూగుల్ లో సెర్చ్చేయగా అక్కడ స్కామర్స్ పెట్టిన నెంబర్ కు ఫోన్ చేశాడు. సమస్యను వివరించగా.. పరిష్కరిస్తామని చెప్తూ ముందు వెరిఫికేషన్‌కోసం ఫోన్ పే ద్వారా తాము చెప్పిన అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్చేయాలని, తర్వాత మొత్తం రీఫండ్చేస్తామని స్కామర్లు చెప్పారు.
వారి మాటలు నమ్మిన బాధితుడు డబ్బులను బదిలీ చేశాడు. కానీ, అమౌంట్ హోల్డ్ లో పడిందని మరికొన్ని డబ్బులు పంపించాలని తెలపడంతో బాధితుడి అకౌంట్ లో డబ్బులు లేవన్నాడు. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు లిమిట్ ను పెంచుకొని, దాని ద్వారా బదిలీ చేయాలని స్కామర్లు కోరగా.. అలాగే చేశాడు. ఇలా దశలవారీగా ఏటీఎం కార్డు డీటైల్స్ తీసుకొని, ఓటీపీ వివరాలతో స్కామర్లు మొత్తం రూ.2,28,334 కాజేశారు. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.