నిజాయితీకి హ్యాట్సాఫ్: హైదరాబాద్‌లో రోడ్డుపై రూ.2 లక్షలు దొరికితే.. పోలీసులకు అప్పగించిన వ్యక్తి

నిజాయితీనా.. అది ఎక్కడా.. ఎలా ఉంటుంది అనే రోజులు.. కలికాలంలో నిజాయితీ ఇంకా బతికే ఉందా అని ప్రశ్నించే రోజులు.. ధర్మం ఇంకా ఈ భూమిపై నడుస్తుందా అనే ఆశ్చర్యపడుతున్న రోజులు.. ఇలాంటి రోజుల్లోనూ నీతి, నిజాయితీ మానుషుల్లో ఉందని.. ఆ నిజాయితీ ఇంకా హైదరాబాద్ రోడ్లపై కనిపిస్తుందని నిరూపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నిజాయితీ వార్త పూర్తి వివరాల్లోకి వెళితే..

అతని పేరు సతీష్.. సికింద్రాబాద్ వాసి. 2024, నవంబర్ 18వ తేదీ.. సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సికింద్రాబాద్ లాలాపేటలోని అయ్యప్పస్వామి ఆలయం మీదుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో.. సతీష్ కు రోడ్డుపై అక్షరాల 2 లక్షల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. రోడ్డుపై 10, 50, 100 నోట్లు అక్కడక్కడ కనిపించటం కామన్. ఎందుకంటే జేబులో నుంచి తీయటం.. పెట్టుకోవటం వంటి సమయంలో కింద పడుతుంటాయి. ఇక్కడ మాత్రం 2 లక్షల రూపాయలు.. నోట్ల కట్టల రూపంలో కనిపించాయి.

రోడ్డుపై దొరికిన 2 లక్షల రూపాయలను తీసుకున్న సతీష్.. వాటిని తన జేబులో పెట్టుకోలేదు. అటూ ఇటూ చూసి నొక్కేయనూ లేదు. ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ లీడర్ కిషోర్ యాదవ్ కు సమాచారం ఇచ్చారు. ఆయన సాయంతో.. నేరుగా లాలాపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి.. రోడ్డుపై దొరికిన నోట్ల కట్టలను లాలాపేట పోలీసులకు అందజేశారు సతీష్, కిషోర్ యాదవ్. వీరి నిజాయితీకి మెచ్చిన పోలీసులు.. వారిని అభినందించారు. 

రోడ్డుపై ఈ 2 లక్షల రూపాయలు ఎవరు పోగొట్టుకున్నారు అనేది ఇంకా తెలియరాలేదు. డబ్బులు పోగొట్టుకున్న వారు లాలాపేట పోలీసులను సంప్రదించాలని కోరారు. అవసరం అయితే సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ చేస్తామని.. డబ్బులు పోగొట్టుకున్నవారికి అందజేస్తామని చెబుతున్నారు లాలాపేట పోలీసులు.

ఏదిఏమైనా హైదరాబాద్ కుర్రోళ్లల్లో ఇంకా నీతి, నిజాయితీ ఉందని.. హైదరాబాదీల్లో మానవత్వం ఉందని నిరూపించిన ఘటన ఇది. అందరూ అందర్నీ ఎందుకు ఉంటారు.. మనుషులందు పుణ్య పురుషులు లేరయ్యా అని ఊరికే అనలేదు కదా..