- మేయర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన షేక్ పేట ఎమ్మార్వో
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి వ్యవహారశైలి అప్పుడే సంచలనమైంది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన షేక్‌పేట తాహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పై బదిలీవేటు పడడం కలకం రేపుతోంది. బంజారాహిల్స్ పరిధిలో ఇష్టానుసారంగా కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వాలని గతంలో షేక్పేట్ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి పై మేయర్ గద్వాల విజయలక్ష్మి చిందులు వేసినట్లు ఆరోపణలున్న విషయం తెలిసిందే. తాహశీల్దార్ ను బండ బూతులు తిట్టినట్లు సోషల్ మీడియాలో షేక్ చేశాయి. తనను బండబూతులు తిట్టడమే కాక విధులకు ఆటంకం కలిగించారని.. కోర్టుకు వెళ్లకుండా అడ్డుకున్నారని అప్పట్లో కార్పొరేటర్ గా ఉన్న గద్వాల విజయలక్ష్మి పై ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ అందునా.. ఒక ఎంపీ కూతురైన విజయలక్ష్మిపైనే పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసిన విజయలక్ష్మి మరోసారి గెలుపొందడమే కాదు.. ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో మేయర్ పీఠం దక్కించుకుంది. అలా మేయర్ పీఠంలో కూర్చుందో లేదో.. సంబరాలు ముగిసిన వెంటనే తన ప్రత్యర్థులపై పంతం నెగ్గించుకునే పని చేపట్టినట్లు దుమారం చెలరేగుతోంది. అప్పట్లో విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మార్వో శ్రీనివాసరెడ్డిని సీసీఎల్ ఏకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో తనకు అనుకూలురైన రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న తాహశీల్దార్ కె.వెంకట్ రెడ్డి నియమించారు. పైకి సాధారణ బదిలీగానే కనిపించినా.. రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. సోషల్ మీడియాలో అయితే ప్రతీకారం తీర్చుకుంది.. కసి తీర్చుకుందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని నీతులు చెప్పి.. ఒక్కరోజులోనే మేయర్ విజయలక్ష్మి బండారం బట్టబయలైందన్న నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి దుడుకు చర్యలు అధికారుల్లో గుబులు రేపుతున్నట్లు తెలుస్తోంది. తన మాట వినకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుందని పరోక్షంగా హెచ్చరిస్తూ.. తన అనుచరుల, సన్నిహితుల వద్ద వ్యక్తిగతంగా ఇదే విషయం చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేయర్ విజయలక్ష్మి పదవి పెత్తనం పై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.
తాహశీల్దార్ ను బదిలీ చేస్తూ జారీ అయిన ఉత్తర్వులు కాపీ ఇదే
ఇవి కూడా చదవండి