- 45 కిలోమీటర్ల మేర విస్తరించాలని నిర్ణయం
- ప్యారడైజ్- –మేడ్చల్ (23 కిలోమీటర్లు).. జేబీఎస్ –శామీర్‌పేట్ (22 కిలోమీటర్లు)
- 3 నెలల్లో డీపీఆర్ సిద్ధం చేసేలా మెట్రో అధికారులకు ఆదేశం
- ఇప్పటికే 3 వైపులా విస్తరణకు చకచకా అడుగులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నార్త్ సిటీకి మెట్రోను విస్తరించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్యారడైజ్ నుంచి- మేడ్చల్ (23 కిలో మీటర్లు), జేబీఎస్ నుంచి- శామీర్ పేట్ (22 కిలోమీటర్లు) వరకు మొత్తం 45 కిలో మీటర్ల మేర విస్తరించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, హెచ్ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ 2 కారిడార్లకు డీపీఆర్ తయారీ విషయంలో బుధవారం చర్చించి, కీలక నిర్ణయం తీసుకున్నారు.
గతంలో తాను మల్కాజ్గిరి ఎంపీగా పనిచేశానని, ఆ ప్రాంత ట్రాఫిక్ సమస్యలు, కారిడార్ల రూట్ మ్యాప్‌లపై తనకు అవగాహన ఉన్నదని మెట్రో ఎండీకి సీఎం తెలిపారు. అయినా కూడా రూట్ మ్యాప్ గురించి ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీకి వివరించి, ఆయన సూచనలు, సలహాలు తీసుకోవాలని ఆదేశించారు.
సెకండ్ ఫేజ్ పార్ట్ బీకి సంబంధించి.. డీపీఆర్స్ తయారీని 3 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సీఎం సూచించారు. మెట్రో ఫేజ్-–2 పార్ట్ ఏ లాగే పార్ట్ బీని కూడా కేంద్ర, -రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని, ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు వెంటనే డీపీఆర్లు, ఇతర అనుబంధ డాక్యుమెంట్ల తయారీ చేపడుతున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే సెకండ్ ఫేజ్ పార్ట్ బీలో ఫ్యూచర్ సిటీ మెట్రోకు సంబంధించి డీపీఆర్ రూపొందుతున్నాయి.
నగరానికి నలువైపులా మెట్రో..
అర్బన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్‌లో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోను నగరం నలువైపులా విస్తరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక మెట్రో ప్రాధాన్యతను గుర్తించి.. నగరంలోని సౌత్, ఈస్ట్, వెస్ట్ దిశల్లో మెట్రో విస్తరణ చేపట్టింది. దీనికి సంబంధించి 5 కారిడార్ల డీపీఆర్స్ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. ప్రస్తుతం నగరానికి ఉత్తరం వైపున్న మేడ్చల్, శామీర్‌పేట్ వరకు మెట్రో విస్తరణకు సీఎం పచ్చ జెండా ఊపడంతో మెట్రో నగర నలుమూలలా విస్తరించనుంది. ఇప్పటికే నగరంలో 69 కిలోమీటర్ల మేర సేవలు అందిస్తున్న మెట్రో... భవిష్యత్తులో మరో 161.4 కిలోమీటర్ల మేర ప్రజలకు అందుబాటులోకి రానున్నది. ప్రస్తుతం పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు పరంగా మెట్రోలో 13 శాతం మంది ప్రయాణిస్తున్నారు. సెకండ్ఫేజ్లోని విస్తరణ పనులు పూర్తయితే.. పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో మెట్రో కీలకంగా మారనున్నది.
రెండు పార్ట్స్ పూర్తయితే 230.4 కిలో మీటర్లు
ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్3 కారిడార్ల పరిధిలో మెట్రో65 కిలో మీటర్లు నడుస్తున్నది. శివారు ప్రాంతాల నుంచి సెంట్రల్ సిటీలోకి వస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో.. నగరానికి నలుమూలలా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈస్ట్ వైపు ఎల్బీనగర్‌వరకు ఉన్న మెట్రోను హయత్ నగర్(7.1 కిలో మీటర్లు) వరకు, వెస్ట్ వైపు మియాపూర్ నుంచి పఠాన్‌చెరు (13.4), రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియో పొలిస్ (11.6) వరకు, సౌత్‌వైపు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్‌సిటీ ముచ్చర్ల (40 కిలో మీటర్లు) వరకు పొడిగిస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు.
ఇవే కాకుండా ఎయిర్పోర్ట్ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని నాగోల్‌నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్వరకు (36.8 కిలో మీటర్లు), ఓల్డ్ సిటీ మెట్రో ఎంజీబీఎస్నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదనలు ఉండగా, ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణ గుట్టవరకు(7.1 కిలో మీటర్లు) విస్తరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉత్తరం వైపు మరో రెండు కారిడార్లను జేబీఎస్ నుంచి శామీర్‌పేట్(22 కిలో మీటర్లు), ప్యారడైజ్ నుంచి మేడ్చల్ (23 కిలో మీటర్లు) వరకు విస్తరించాలని సీఎం మెట్రో అధికారులను ఆదేశించారు. దీంతో సెకండ్ ఫేజ్‌లో పార్ట్ ఏ, పార్ట్ బీ మెట్రో పూర్తయితే సిటీలో మెట్రో 230.4 కిలో మీటర్ల మేర సేవలు అందించనున్నది.
రేవంత్‌కు ధన్యవాదాలు: మంత్రి పొన్నం ప్రభాకర్
నార్త్ సిటీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ నుంచి వచ్చే వాహనదారులు శివారుల్లో ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడ్తున్నారని, శామీర్ పేట్ వరకు మెట్రోను పొడిగించాలని గతంలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. ఈ రూట్లలో ఇప్పటికే డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ మంజూరు కావడం, తాజాగా మెట్రో మార్గానికి సీఎం పచ్చజెండా ఊపడంతో ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయని అన్నారు. ఈ మెట్రో మార్గం పూర్తయితే సిటీ నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లేవారికి చాలా సమయం ఆదా అవుతుందని తెలిపారు.
నార్త్ వైపు మెట్రోవిస్తరణ వివరాలు..
ప్యారడైజ్– మేడ్చల్ (23 కిలో మీటర్లు)ప్యారడైజ్ మెట్రోస్టేషన్ – తాడ్ బంద్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ జేబీఎస్ – శామీర్‌పేట్(22 కిలో మీటర్లు) జేబీఎస్ మెట్రో స్టేషన్ – విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్ పేట్