హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకింగ్ న్యూస్ చెప్పింది. మెట్రో స్టేషన్లలో ఇప్పటి వరకు ఉచితంగా ఉన్న వాహనాల పార్కింగ్‌కు ఇకపై ఫీజు వసూల్ చేయనున్నట్లు తెలిపింది. స్టేషన్లలో ఫ్రీ పార్కింగ్ సౌకర్యం ఎత్తేసిన మెట్రో.. అక్టోబర్ 6, 2024 (ఆదివారం) నుండి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజు (రుసుములను) వసూలు చేయనున్నట్టు సంస్థ యాజమాన్యం ఎల్& టి ఎంఆర్ హెచ్ఎల్ ఇవాళ (సెప్టెంబర్ 30) ప్రకటించింది. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో వెల్లడించింది.
ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని మెట్రో విజ్ఞప్తి చేసింది. కాగా, మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూల్ చేయాలని గతంలోనే యాజమాన్యం డిసైడ్ అయ్యింది. ఈ ఏడాది ఆగస్ట్ 15 నుండి స్టేషన్ల వద్ద పార్కింగ్ ఫీజుకు సంబంధించిన వివరాలను సైతం డిస్ ప్లై చేసింది. అయితే, ఫ్రీ సౌకర్యం ఎత్తేయడంపై ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. పార్కింగ్ చార్జీలకు నిరసనగా ప్రయాణికులు నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా ఆందోళనకు దిగారు. పార్కింగ్ చార్జీల వసూల్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రయాణికుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో పార్కింగ్ చార్జీల వసూల్ విషయంలో మెట్రో యాజమాన్యం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పార్కింగ్ చార్జీల వసూల్ ను తాత్కలిక వాయిదా వేసిన మెట్రో.. తాజాగా ఇవాళ పార్కింగ్ ఫీజుపై కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల (అక్టోబర్) 6వ తేదీ నుండి పార్కింగ్ ఫీజు వసూల్ చేస్తామని అనౌన్స్ చేసి ప్రయాణికులకు ఝలక్ ఇచ్చింది మెట్రో యాజమాన్యం. పార్కింగ్ ఫీజు వసూల్‌పై ప్రయాణికులు మరోసారి ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యవసర సరుకుల ధరలతో సతమతం అవుతుండగా.. ఈ మెట్రో తీసుకున్న నిర్ణయం తమకు గుదిబండగా మారుతోందని ప్రయాణికులు తీవ్న అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.