
- మెట్రో, పోలీస్ డిపార్ట్మెంట్ తో ఒప్పందం
- ట్యూటెమ్ వర్క్ షాప్లో పాల్గొన్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: మహిళా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా మెట్రో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. సేఫ్ గా గమ్యస్థానాలకు చేర్చేందుకు ట్యూటెమ్ యూజర్(టెక్నాలజీస్ ఫర్ అర్బన్ ట్రాన్సిట్ టు ఎన్హాన్స్ మొబిలిటీ అండ్ సేఫ్ యాక్సెసిబిలిటీ) అనే యాప్ ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. బిట్స్ పిలాని క్యాంపస్ లో గురువారం జరిగిన యూజర్ వర్క్ షాప్లో ఆయన పాల్గొన్నారు.
హైదరాబాద్మెట్రో రైల్, పోలీసుల సహకారంతో బిట్స్ పిలానీ-హైదరాబాద్ క్యాంపస్, ఐఐటీ ఖరగ్ పూర్, ఐఐటీ బొంబాయి సంయుక్తంగా ఏడీబీ(ఏషియన్ డెవపల్ మెంట్ బ్యాంక్) ఆర్థిక సహాయంతో ట్యూటెమ్ అనే యాప్ను డెవలప్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా మహిళా ప్రయాణికుల లొకేషన్ ట్రాక్ చేయడంతోపాటు, రాత్రి సమయాల్లో అభద్రతకు లోనైతే తోటి ప్రయాణికులు తోడుగా వెళ్లేలా డెవలప్ చేస్తున్నట్లు వివరించారు. ఎస్ఓఎస్ సౌకర్యం ఉంటుందన్నారు.
మెట్రో, హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్లు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. బిట్స్ పిలానీ వీసీ ప్రొఫెసర్ వి.రామ్ గోపాల్ రావు ట్యూటెమ్ యాప్ సేవలను హైదరాబాద్ తో పాటు ఇతర సిటీలకు విస్తరించేలా తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. ఏడీబీ ప్రతినిథి కుమారి జోసెఫిన్ ఎక్వినో, బిట్స్ పిలానీ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సౌమ్యో ముఖర్జీ, ఐఐటీ బొంబాయి కి చెందిన ప్రొఫెసర్ అవిజిత్ మాజీ, బిట్స్ పిలానీ ప్రొఫెసర్ ప్రశాంత్ సాహు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.